kumaram bheem asifabad- పక్కాగా సన్నాల లెక్క
ABN , Publish Date - Aug 01 , 2026 | 10:53 PM
సన్నరకం వరి వంగడాలకు ఇచ్చే బోనస్ దుర్వినియోగం కాకుండా దళారులు చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు 2026 వానకాలం సీజ్ నుంచి ప్రత్యేక విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. సన్నరకం సాగు చేస్తున్న రైతులు విత్తనాలు కొనుగోలు నుంచే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. బోనస్ చెల్లించనున్న రకం వరి వంగడాల సాగు లెక్కలు పక్కాగా ఉండేలా చూడాలని ఆదేశించింది.
- విత్తన కొనుగోలు నుంచే ఆన్‌లైన్‌లో నమోదు
- డీలర్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
- నమోదు కాని రైతులు బోనస్‌కు దూరం
కాగజ్‌నగర్ ఆగస్టు, 1 (ఆంధ్రజ్యోతి): సన్నరకం వరి వంగడాలకు ఇచ్చే బోనస్ దుర్వినియోగం కాకుండా దళారులు చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు 2026 వానకాలం సీజ్ నుంచి ప్రత్యేక విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. సన్నరకం సాగు చేస్తున్న రైతులు విత్తనాలు కొనుగోలు నుంచే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. బోనస్ చెల్లించనున్న రకం వరి వంగడాల సాగు లెక్కలు పక్కాగా ఉండేలా చూడాలని ఆదేశించింది. విస్తరణాధికారుల వద్ద ఉన్న లెక్కలతో ఇవి సరిపోవాలని ఏ మాత్రం తేడా ఉండరాదని పేర్కొన్నది. డీలర్ల వద్ద కాకుండా సొంతంగా విత్తనాలు, దాచుకుని సాగుచేసే రైతులు తమ పరిధిలోని ఏఈవో ద్వారా యాప్‌లో నమోదు చేసుకునే వెసులు బాటును కూడా ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. 2026 వానాకాలం సీజన్‌లో సాగు చేసే నిర్ధేశిత ఏడు రకాల సన్నవరి పంటలకు ప్రభుత్వం ఇక బోనస్ చెల్లించనున్నది. ఏయే రకాల సన్నరకం వరి వంగడాలకు ప్రభుత్వం బోనస్ చెల్లించనున్నారు. తెలంగాణ సోన(ఆర్‌ఎస్‌ఆర్-15048) వంట కాలం 120 నుంచి 125 రోజులు, సాంబమాసూరి(బీపీటీ-5204) పంట కాలం 145 నుంచి 150 రోజులు, కేఎస్‌ఎం(1638) పంట కాలం 125 నుంచి 130 రోజులు, హెచ్‌ఎంటీ సో న పంట కాలం 134 నుంచి 145 రోజులు, జై శ్రీరాం పంట కాలం 125 నుంచి 130 రోజుల వరకు, డబ్ల్యుకె ఎల్-44 పంట కాలం 130 నుంచి 145 రోజుల, కెఎస్‌ఎం(7715) పంట కాలం 125 నుంచి 130 రోజుల వరకు ఉంటుంది. రైతుల రాష్ట్రంలో ఎక్కడ విత్తనాలు కొనుగోలు చేసినా ఆ వివరాలు జిల్లా వ్యవసాయా శాఖ కార్యాలయానికి పంపిస్తారు. దీంతో సన్నరకం సాగు వివరాలు పక్కాగా తెలియజేనున్నాయి.
- వ్యవసాయాధికారుల పర్యవేక్షణ
దుకాణాదారులు ఈ ప్రక్రియను సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అనేది మండల స్థాయి వ్యవసాయాధికారులు పర్యవేక్షణ చేస్తారు. ఇప్పటికే కొనుగోలు చేసిన వరి విత్తనాల రకాలను సైతం ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. విత్తనాల కొనుగోలు చేసినప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలను ఏఈవోలు పంటల నమోదులో సరి చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆన్‌లైన్‌లో విత్తన కొనుగోలు నమోదు చేయని రైతులకు బోనస్ దూరమయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో నమోదుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. డీలర్లు సులభంగా లాగిన్ కావటానికి వీలుగా క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని కూడా కల్పించింది. ఈ సైట్‌లో సన్నరకం వరి రకాల అమ్మకాల ఆప్షన్‌ను ఎంచుకొని కొనుగోలు చేసిన రైతు పేరు, ఆయన తండ్రి పేరు, మోబైల్ నంబరు, ఆధార్ వంటి ప్రాథమిక వివరాలతో పాటు విత్తనరకం, కంపెనీ పేరు, లాబ్ నెంబరు, సీడ్ ప్యాకెట్, సైజ్, కొనుగోలు చేసిన తేదీని ఖచ్చితంగా నమోదు చేయాలి. డిజిటల్ నమోదు ప్రక్రియ కేవలం 2026 వానాకాలం సీజన్‌లో విక్రయించే విత్తనాలకు మాత్రమే వర్తిస్తుందని, ప్రభుత్వం విధించిన గడువు లోపలే డీలర్లు, ఈ ప్రక్రియను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.