kumaram bheem asifabad- పక్కాగా ఇళ్ల లెక్కింపు
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:00 PM
జిల్లాలో నివాస గృహాల లెక్కింపుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. మే 11 నుంచి ఈ సర్వేను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. జిల్లాలో ఇప్పటికే తొలి దశ ఎన్యూమరేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ శిక్షణలో కూడా సర్వే నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు
- 35 అంశాలతో సమాచార సేకరణ
- ఎన్యూమరేటర్లకు మొదటి విడత శిక్షణ పూర్తి
కాగజ్‌నగర్, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నివాస గృహాల లెక్కింపుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. మే 11 నుంచి ఈ సర్వేను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. జిల్లాలో ఇప్పటికే తొలి దశ ఎన్యూమరేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ శిక్షణలో కూడా సర్వే నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సారి జరిగే సర్వేను 35 కీలక అంశాల ఆధారం గా నిర్వహించనున్నారు. ప్రతీ ఇంటిని ప్రత్యక్షంగా సందర్శించి ఎన్యూమరేటర్లు కుటుంబ సభ్యుల వివరాలు, గృహస్థితి, ఆదాయ వనరులు, మౌలిక సదుపాయాలు, తదితర అంశాలపై సమాచా రం సేకరించనున్నారు. ఎలాంటి ఇంటి సమాచారం మిగలకుండా పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- మున్సిపాలిటీల పరిధిలో కమిషనర్లు..
మున్సిపాలిటీల పరిధిలో కమిషనర్లు, మండలాలకు సంబంధిత తహసీల్దార్లు ఈ సర్వేలకు పూర్తి బాధ్యతలను అప్పగించారు. ఈ సర్వే ద్వారా జిల్లాలోని అసలు ఇళ్ల సంఖ్య, నివాస పరిస్థితులు, అర్హులైన లబ్ధిదారుల వివరాలు స్పష్టంగా తేలనున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల సరైన అమలు, భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల రూప కల్పనకు ఈ సర్వే ఎంతో కీలకంగా మారనుంది. సర్వే సమయంలో ప్రజలు ఎన్యూమరేటర్లకు సహకరించి సరైన వివరాలు ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. సర్వే పూర్తయ్యాక ఇళ్ల జాబితా వివరాలు ఖరారు చేసి తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ప్రతీ 800 మందికి ఒక ఎన్యూమరేటర్‌ను కేటాయించారు. వీరిని పర్యవేక్షించేందుకు సూపర్‌వైజర్లను సైతం నియమించారు. ఈ నెల 18, 20, 21లో తొలి దశ ఎన్యూమరేటర్లకు తొలి దశ, రెండో దశ ఈ నెల 23, 25, 25, మూడో దశ ఈ నెల 27, 28, 29 శిక్షణ పూర్తి చేయనున్నారు. జిల్లాలో 240 హౌస్ బ్లాక్‌లుగా గుర్తించారు. మే 11 నుంచి ప్రారంభమై జూన్ 9 వరకు ఈ సర్వే నిర్వహించనున్నారు. ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లకు పూర్తిగా సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు.
- గుర్తింపు క్యూ ఆర్ కోడ్‌లతో..
ఎన్యూమరేటర్లు, సిబ్బంది ఇంటింటా సర్వేలు చేపట్టేందుకు ప్రతి ఇంటికి రానుండడంతో అధికారులు ముందుస్తుగా ప్రతీ ఒక్కరికి గుర్తింపు కార్డులు అందజేయనున్నారు. ఈ కార్డులకు కూడా క్యూ ఆర్ కోడ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్న దృష్ట్యా అధికారులు పక్కాగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. క్యూ ఆర్ కోడ్‌ను సెల్ ఫోన్‌లో స్కాన్ చేసిన కూడా సంబంఽధిత ఎన్యూమరేటర్ వివరాలు క్షణాల్లో వచ్చే అవకాశాలున్నాయి. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఉండేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
సర్వేకు ప్రజలు సహకరించాలి..
- మధూకర్, తహసీల్దార్, కాగజ్‌నగర్
ఈ సర్వేకు అంతా సహకరించాలి. మే 11 నుంచి జరుగనున్న నివాస గృహాల లెక్కింపుకు అంతా సిద్ధం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎన్యూమరేటర్లకు శిక్షణ పూర్తి చేశాం. ఎన్యూమరేటర్లకు శిక్షణ జరుగుతుంది. శిక్షణలో సర్వే చేసే విధానంపై స్పష్టంగా అవగాహన కల్పిస్తున్నాం. సెల్ ఫోన్ ద్వారా వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. ఇంటి స్థితి గతులకు సంబంధించిన 35 అంశాలు అడుగనున్నారు.