Share News

పేరుకుపోయిన సీఎంఆర్‌ నిల్వలు

ABN , Publish Date - Aug 20 , 2026 | 01:10 AM

కస్టమ్‌ మిల్లింగ్‌రైస్‌ (సీఎంఆర్‌) గడువులోగా చెల్లించాలని ప్రభుత్వం మిల్లర్లపై ఒత్తిడి చేస్తోంది. మరోవైపు మిల్లర్లు సిద్ధంగా ఉన్నా బియ్యం సేకరణకు ఎఫ్‌సీఐ గోదాముల్లో చోటు లేకపోవడంతో పరిస్థితి తలకిందులైంది. మిల్లుల్లో బియ్యం నిల్వలు పేరుకుపోవడంతో మిల్లింగ్‌ కార్యకలాపాలు నిలిచిపోయాయి. 15 రోజులుగా పలు మిల్లులు

పేరుకుపోయిన సీఎంఆర్‌ నిల్వలు

జగిత్యాల, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కస్టమ్‌ మిల్లింగ్‌రైస్‌ (సీఎంఆర్‌) గడువులోగా చెల్లించాలని ప్రభుత్వం మిల్లర్లపై ఒత్తిడి చేస్తోంది. మరోవైపు మిల్లర్లు సిద్ధంగా ఉన్నా బియ్యం సేకరణకు ఎఫ్‌సీఐ గోదాముల్లో చోటు లేకపోవడంతో పరిస్థితి తలకిందులైంది. మిల్లుల్లో బియ్యం నిల్వలు పేరుకుపోవడంతో మిల్లింగ్‌ కార్యకలాపాలు నిలిచిపోయాయి. 15 రోజులుగా పలు మిల్లులు మూతపడడంతో అక్కడ పనిచేసే ఇతర రాష్ట్రాల కార్మికులు స్వగ్రామాలకు వెళ్లిపోతున్నారు. గోదాముల్లో నిల్వలు ఖాళీ అయితేనే మళ్లీ మిల్లింగ్‌ ప్రారంభించే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రైస్‌ మిల్లర్లకు కేటాయిస్తున్న గోదాంలతో నిర్ణీత లక్ష్యం మేరకు సీఎంఆర్‌ అప్పగించడానికి మరో 600 పనిదినాల సమయం పడుతుందని అంటున్నారు.

ఫ 5,53,650 మెట్రిక్‌ టన్నుల బియ్యం బకాయిలు..

జిల్లాలో మూడు పంట సీజన్లలో సుమారు 5,53,650 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ బియ్యం బకాయిలు ఉన్నట్లు అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాలో 220 రైస్‌ మిల్లులు ఉండగా వాటిలో 112 బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు ఉన్నాయి. 2024-25 యాసంగి సీజన్‌కు సంబంధించి 79,020 మెట్రిక్‌ టన్నుల బియ్యం బకాయిలున్నాయి. ఈనెలాఖరులోపు సీఎంఆర్‌ అప్పగించడానికి గడువు ఉంది. 2025-26 వానాకాలం సీజన్‌కు చెందిన 67 రైస్‌ మిల్లులకు చెందిన 1.66 మెట్రిక్‌ టన్నుల బియ్యం బకాయిలు, 2025-26 యాసంగి సీజన్‌కు సంబంధించి 3,08,350 మెట్రిక్‌ టన్నుల బియ్యం బకాయిలున్నాయి. 2025-26 వానాకాలం, 2025-26 యాసంగి సీజన్‌లకు చెందిన సీఎంఆర్‌ అప్పగించడానికి అక్టోబరు 31వ తేదీ వరకు గడువు ఉంది.

ఫ15 రోజులుగా మిల్లులు బంద్‌..

2024-25 యాసంగి సీజన్‌లో ప్రభుత్వం అప్పగించిన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్‌ను ఈ నెలాఖరులోగా చెల్లించేందుకు ఎఫ్‌సీఐ గడువు విధించింది. గడువు సమీపిస్తున్నా బియ్యం తీసుకునేందుకు గోదాముల్లో స్థలం లేకపోవడంతో మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 50 మిల్లులకు సంబంధించి సుమారు 79 వేల మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ బియ్యం బకాయి ఉన్నట్లు సమాచారం. ఇందులో ఐదు రా రైస్‌, 45 బాయిల్డ్‌ రైస్‌ టార్గెట్లు ఉన్నాయి. గడువు ముగిసేలోగా సీఎంఆర్‌ అప్పగించకపోతే చర్యలు తప్పవన్న ఆందోళన మిల్లర్లలో నెలకొంది. అయితే మిల్లింగ్‌ చేసిన బియ్యాన్ని గోదాములకు తరలించే పరిస్థితి లేకపోవడంతో కొత్తగా ధాన్యాన్ని మరాడించలేకపోతున్నామని వారు చెబుతున్నారు.

ఫగూడ్స్‌ వ్యాగన్ల కోసం ఎదురుచూపులు...

గోదాముల్లో ప్రస్తుతం నిల్వ ఉన్న బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించాలంటే ఎఫ్‌సీఐ గూడ్స్‌ వ్యాగన్లు కేటాయించాల్సి ఉంది. కానీ నెల రోజులుగా అడపాదడపా మినహా వ్యాగిన్లు రాకపోవడంతో గోదాముల్లో నిల్వలు కదలడం లేదు. దీంతో కొత్తగా వచ్చే సీఎంఆర్‌ బియ్యాన్ని నిల్వ చేసేందుకు స్థలం లేకుండా పోయింది. మరో రెండు రోజుల వరకు వ్యాగిన్లు వచ్చే అవకాశం లేదన్న సమాచారం మిల్లర్ల ఆందోళనను మరింత పెంచుతోంది. మిల్లింగ్‌ చేసి సిద్ధంగా ఉంచిన బియ్యాన్ని గోదాములకు తరలించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫగోదాములన్నీ నిండిపోయి..

జిల్లాలో ఎఫ్‌సీఐకి చెందిన ఏడు గోదాములు 1.60 లక్షల మెట్రిక్‌ టన్నుల చొప్పున నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయా గోదాములు నిల్వలతో నిండిపోయాయి. బహిరంగ ప్రదేశాల్లో టార్పాలిన్లు కప్పి బియ్యాన్ని భద్రపరుస్తున్నారు. దీంతో మిల్లర్లు సీఎంఆర్‌ బియ్యాన్ని తీసుకువచ్చినా స్వీకరించేందుకు ఎఫ్‌సీఐ అధికారులు స్థలం లేదని చెబుతున్నారు. దీనికి తోడు ఇటీవల సిరిసిల్ల జిల్లాకు చెందిన 28 రైస్‌ మిల్లులకు జగిఆ్యల జిల్లాలోని గోదాముల్లో డెలివరీకి కేటాయించడం సమస్యను మరింత జఠిలంగా మార్చిందంటున్నారు. మిల్లర్లు చేసిన అభ్యర్థన మేరకు జగిత్యాల జిల్లాకు చెందిన 18 మిల్లులను నిజామాబాద్‌ జిల్లాలోని డిచ్‌పల్లి గోదాములకు మళ్లించారు. అయితే ఆ ఆతర్వాత సిరిసిల్ల జిల్లాకు చెందిన 22 మిల్లులను కూడా డిచ్‌పల్లి గోదాంకు కేటాయించడంతో అక్కడ కూడా తీవ్ర రద్దీ ఏర్పడింది. దీంతో మిల్లింగ్‌ చేసిన బియ్యాన్ని గోదాములకు తరలించే మార్గం లేక పలు మిల్లుల్లోనే నిల్వ చేస్తున్నారు. గోదాముల్లో నిల్వలను వేగంగా తరలించి కొత్త సీఎంఆర్‌ బియ్యం నిల్వ చేసేందుకు అవకాశం కల్పించాలని మిల్లర్లు కోరుతున్నారు.

ఫమంత్రి అడ్లూరికి మిల్లర్ల మొర..

సమస్య పరిష్కారం కోసం ఫారా బాయిల్డ్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఇటీవల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. ఎఫ్‌సీఐ అధికారులతో మాట్లాడి గోదాముల్లో స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మిల్లర్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయింపు జరగకపోవడంతో సమస్య కొనసాగుతోంది.

రైస్‌ మిల్‌ ఇండస్ట్రీని రక్షించాలి

-బట్టు ప్రవీణ్‌, రైస్‌ మిల్లర్‌, జగిత్యాల

రైస్‌ మిల్లుల యాజమాన్యాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మిల్‌ ఇండస్ట్రీని రక్షించే దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలి. ప్రభుత్వం ప్రతీ వారం రైస్‌మిల్లుల్లో ధాన్యం నిల్వల తనిఖీలు నిర్వహించి రిజిస్టర్‌లో నమోదు చేయాలి. నాణ్యత కూడిన బియ్యం ఉంటేనే ఎఫ్‌సీఐ స్వీకరిస్తుంది. గతంలో ఎప్పటికప్పుడు బియ్యం సేకరణ జరిగేది. పస్తుతం పక్షానికి కూడా గోదాముల్లో స్థలం కేటాయించడం లేదు. కొన్ని సంవత్సరాలుగా మిల్లింగ్‌ చార్జీలు, డ్రై చార్జీలు ఇవ్వలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడడంతో మిల్లింగ్‌ వ్యవస్థపై ప్రభావం పడుతోంది.

Updated Date - Aug 20 , 2026 | 02:56 AM