Share News

స్వచ్ఛ బడికి పట్టం..

ABN , Publish Date - Jun 25 , 2026 | 01:02 AM

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించేందుకు కేంద్ర విద్యా శాఖ అమలు చేస్తున్న ‘స్వచ్ఛ ఏవం హరిత్‌ విద్యాలయం’ రేటింగ్‌ (ఎస్‌హెచ్‌వీఆర్‌)లో 2025-26 జాతీయ స్థాయి పురస్కారానికి బీర్‌పూర్‌ పీఎంశ్రీ మండల పరిషత్‌

స్వచ్ఛ బడికి పట్టం..

జగిత్యాల, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించేందుకు కేంద్ర విద్యా శాఖ అమలు చేస్తున్న ‘స్వచ్ఛ ఏవం హరిత్‌ విద్యాలయం’ రేటింగ్‌ (ఎస్‌హెచ్‌వీఆర్‌)లో 2025-26 జాతీయ స్థాయి పురస్కారానికి బీర్‌పూర్‌ పీఎంశ్రీ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఎంపికైంది. కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన రేటింగ్‌లో రాష్ట్రం నుంచి ఎంపికైన పాఠశాలల జాబితాలో జిల్లాలోని బీర్‌పూర్‌ పీఎం శ్రీ పాఠశాలకు చోటు దక్కింది. నీటి వసతి, పరిశుభ్రత, పారిశుద్యం, పర్యావరణహిత పరిసరాలు, తడి చెత్త, పొడి చెత్త, కిచెన్‌ గార్డెన్‌, మొక్కలు, చెట్ల పచ్చదనంతో పాఠశాల ప్రాంగణం విలసిల్లుతోంది. మొత్తం 29 అంశాల ఆధారంగా ఈనెల 12న కేంద్ర బృందం జాతీయ స్థాయికి ఎంపిక చేసింది. పాఠశాలకు జాతీయ స్థాయి పురస్కారంతో పాటు రూ.లక్ష నగదు ప్రోత్సాహకానికి కేంద్ర విద్యాశాఖ ఎంపిక చేసింది.

ఫబీర్‌పూర్‌ పాఠశాలలలో పరిస్థితి ఇలా..

బీర్‌పూర్‌ పాఠశాలలో మొత్తం 162 మంది విద్యార్థులున్నారు. ఇందులో బాలికలు 77బాలురు 75 మంది బాలికలు అభ్యసిస్తున్నారు. నలుగురు ఉపాధ్యాయులు, ఒకరు ప్రీప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్‌, ఒకరు ఆయా, ఒకరు డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయుడు విధులు నిర్వర్తిస్తున్నారు. పాఠశాలలో నాలుగు తరగతి గదులు, ఒకటి ఆఫీస్‌ రూమ్‌, బాలికలకు 2, బాలురకు రెండు టాయిలెట్స్‌, మరుగుదొడ్లున్నాయి. ఒకటి అదనపు తరగతి గది, ఒకటి బాలికల టాయిలెట్‌ నిర్మాణంలో ఉంది. పాఠశాలలో ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్‌, సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌, హరితహారం కింద సుమారు 200 వివిధ రకాల మొక్కలున్నాయి. ఏకో క్లబ్‌ నిర్వహణ, వర్మీకాంపోస్టు తయారీ యూనిట్‌ ఏర్పాటు చేశారు. పాఠశాల ముందు వైపు ఫ్లవర్‌ గార్డెన్‌, వెనుక వైపున కిచెన్‌ గార్డెన్‌ అందంగా కనిపిస్తోంది. కిచెన్‌ గార్డెన్‌లో ఆర్గానిక్‌ పద్ధతిలో పండించిన వివిధ రకాల కూరగాయలను మధ్యాహ్న భోజనంలో వంటకు వినియోగిస్తున్నారు. రెయిన్‌ వాటర్‌, డ్రైయిన్‌ వాటర్‌ను భూమిలోకి పంపడానికి ప్రత్యేకంగా ఇంకుడుగుంత ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సహజ వనరుల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. సబ్బుతో చేతులు కడుక్కునే పద్ధతిని విద్యార్థులకు అలవర్చారు.

ఫఎంపిక ప్రక్రియ ఇలా..

జిల్లా స్థాయిలో ప్రధానోపాధ్యాయులు పొందుపర్చిన సమాచారం మేరకు స్టార్‌ రేటింగ్‌ ప్రకారం కలెక్టర్‌, డీఈవో, వైద్యాధికారి, ఇంజనీరింగ్‌ అధికారి, స్వచ్ఛంద సంస్థ, ముగ్గురు ఉపాధ్యాయులతో కూడిన కమిటీ ఎంపిక చేసింది. మూడు లేదా అంతకంటే ఎక్కువ స్టార్‌ రేటింగ్‌ ఉన్న ఆరు గ్రామీణ పాఠశాలలు, రెండు పట్టణ ప్రాంతాల్లో ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపింది. రాష్ట్ర విద్యాశాఖ, వైద్య శాఖ, పంచాయతీ రాజ్‌, స్థానిక సంస్థల పర్యవేక్షకులు, స్వచ్చంద సంస్థ, ఇద్దరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కూడిన కమిటీ ఎంపిక చేసింది. నాలుగు స్టార్‌ రేటింగ్‌, అంతకన్నా ఎక్కువ రేటింగ్‌ ఉన్న 14 గ్రామీణ ఉన్నత పాఠశాలలు, 6 పట్టణ పాఠశాలలను ఎంపిక చేసి జాతీయ స్థాయి పోటీలకు పంపింది. జాతీయ స్థాయిలో 5 స్టార్‌ రేటింగ్‌ కలిగిన 140 గ్రామీణ, 60 పట్టణ ప్రాంతాల పాఠశాలలను ఎంపిక చేశారు. జాతీయ స్థాయిలో స్వచ్ఛ హరిత్‌ విద్యాలయం రేటింగ్స్‌లో ఎంపికైన ప్రతీ పాఠశాలకు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహక బహుమతిని అందజేస్తారు. ఇలా జిల్లాలోని బీర్‌పూర్‌ పాఠశాల జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికైంది.

ఫరేటింగ్‌ ఇలా..

పాఠశాల నిర్వహణ ఆధారంగా రెండు నుంచి ఐదు వరకు రేటింగ్‌లు కేటాయిస్తారు. 35 పాయింట్ల నుంచి 50 పాయింట్ల వరకు 2 స్టార్‌, 51 పాయింట్ల నుంచి 74 పాయింట్‌ వరకు 3 స్టార్‌, 75 నుంచి 89 వరకు 4 స్టార్‌, 90 నుంచి ఆపై వరకు 5 స్టార్‌ రేటింగ్‌ ఇస్తారు. ఇందులో మంచినీటి వినియోగానికి 20 పాయింట్స్‌, మరుగుదొడ్ల నిర్వహణ 27, సబ్బులతో చేతులు కడుక్కోవడం 14, ప్రవర్తన, మార్పు 20, పచ్చదనం పరిశుభ్రత 21, పాఠశాలల్లో పర్యావరణ క్లబ్‌ ఏర్పాటు, ఎల్‌ఈడీ బల్బుల వినియోగం, మొక్కలు నాటడం, ప్లాస్టిక్‌ నివారణ, సోలార్‌ ప్యానల్‌ ఏర్పాటు వంటి అంశాలకు 21 పాయింట్లు ఉంటాయి. మొత్తం 125 పాయింట్స్‌ ఉంటాయి. పలు విభాగాల్లో అందులోని అంశాలపై వివరాలను పొందుపరిస్తే వచ్చిన పాయింట్స్‌ ఆధారంగా పాఠశాలకు స్టార్‌ రేటింగ్‌ ఇస్తారు.

ఫపర్యావరణంపై అవగాహణ కల్పించే దిశగా అడుగులు..

పాఠశాలల్లో స్వచ్ఛత పెంచేలా విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన కల్పించే దిశగా బడులను తీర్చిదిద్దుతున్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఉండేవి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మార్పు వచ్చింది. తాగునీరు, ఆధునిక క్రీడా పరికరాలు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, రంగురంగుల అలంకరణతో తరగతి గదులు ఇలా అన్నీ సమకూరుతున్నాయి. మెరుగైన వసతులున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో కొన్ని పాఠశాలలు వెనుకబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తున్న ‘స్వచ్ఛ ఏవం హరిత్‌ విద్యాలయం’ పురస్కారాలు పాఠశాలల్లో స్వచ్ఛ ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

సమష్టి కృషితో సాధ్యమైంది

-సుదర్శన్‌, ప్రధానోపాధ్యాయుడు, బీర్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాల

ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితోనే కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తున్న ‘స్వచ్ఛ ఏవం హరిత్‌ విద్యాలయం’ జాతీయ పురస్కారానికి పాఠశాల ఎంపికైంది. గత విద్యా సంవత్సరంలో దసరా సెలవుల్లో ప్రత్యేకంగా పాఠశాలకు వస్తూ జాతీయ పురస్కారానికి అర్హత సాధించే అన్ని వసతులను ఏర్పాటు చేయడానికి కృషి చేశాం. ఫ్లవర్‌ గార్డెన్‌, కిచెన్‌ గార్డెన్‌ తదితర నిర్వహణ వల్ల జాతీయ స్థాయి పురస్కారం లభించింది.

జాతీయ స్థాయి పురస్కారం రావడం అభినందనీయం

-సత్యప్రసాద్‌, కలెక్టర్‌

జిల్లాలోని బీర్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాల జాతీయ స్థాయి ‘స్వచ్ఛ ఏవం హరిత్‌ విద్యాలయం’ పురస్కారాన్ని అందుకోవడం అభినందనీయం. ఇందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నాను. జాతీయ పురస్కారం రావడం జిల్లా విద్యా శాఖకు మరింత వన్నె తెచ్చింది. మున్ముందు మరిన్ని పాఠశాలలు ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి.

Updated Date - Jun 25 , 2026 | 01:02 AM