ఏసీబీ వలలో ఇద్దరు ఇంజనీర్లు
ABN , Publish Date - Jul 17 , 2026 | 06:09 AM
ఆదిలాబాద్‌లోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేసి ఇద్దరు అధికారులను లంచం తీసుకొంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
60 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం
హైదరాబాద్‌లోని ఈఈ నివాసంలోనూ సోదాలు
ఆదిలాబాద్ టౌన్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌లోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేసి ఇద్దరు అధికారులను లంచం తీసుకొంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. సొనాల ప్రాంతానికి చెందిన చౌహన్ విక్రమ్ సింగ్ పౌల్ర్టీఫామ్ ఏర్పాటు కోసం ఎన్‌ఓసీ కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఈఈ రాథోడ్ విఠల్, ఏఈ రమేష్ కలిసి రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. బాధితుడు అంత ఇచ్చుకోలేనని రూ.60 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి పథకం మేరకు.. నీటి పారుదల శాఖ కార్యాలయంలో బాధితుడు ఇంజనీర్లకు డబ్బులు ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లోని ఈఈ నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఇద్దరు ఇంజనీర్లపైౖ కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు.