మరో నలుగురిపై ఏసీబీ కన్ను!
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:48 AM
డీఎస్పీ భీంరెడ్డి అవినీతి వ్యవహారం నేపథ్యంలో.. పోలీసుశాఖలోని మరో నలుగురు అధికారులపై ఏసీబీ దృష్టి సారించినట్లు సమాచారం.
డీఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి గల ఆ అధికారుల అక్రమాస్తుల వివరాలతో ఫైళ్లు సిద్ధం
పోలీసుశాఖలో ప్రకంపనలు
కొన్నేళ్లలోనే పెరిగిపోయిన వారి సంపదపై చర్చ
కొందరు అధికారులకు బినామీలుగా ఉంటూనే..వారు స్వయంగా వెనకేసుకున్నారని గుసగుసలు
ఏసీబీ దూకుడుతో బినామీల్లోనూ కలవరం
హైదరాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): డీఎస్పీ భీంరెడ్డి అవినీతి వ్యవహారం నేపథ్యంలో.. పోలీసుశాఖలోని మరో నలుగురు అధికారులపై ఏసీబీ దృష్టి సారించినట్లు సమాచారం. వీరి అక్రమార్జనకు సంబంధించిన ఫైళ్లను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ‘బీఆర్‌ఎస్ నేతలతో కలిసి నాటి అధికారులు ప్రజల సొమ్ము దోచుకున్నారు. ఏసీబీ వారి భరతం పడుతోంది. ఒక్కో అధికారి వద్ద వందల కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. ఇదంతా ప్రజల సొమ్ము కాదా?’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేసిన ప్రశ్న పోలీసుశాఖలోని బినామీ అధికారులను వణికిస్తోంది. పోలీసుశాఖలో కొందరు పెద్దలకు కొందరు కింది స్థాయి అధికారులు నమ్మినబంట్లుగా ఉన్నారని, అలాంటి వారు ఇటీవల కాలంలో హఠాత్తుగా ఎదిగిపోయారని, వారిలో భీంరెడ్డి ఒకరని అధికారులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే, రాష్ట్ర పోలీసు విభాగంలో అత్యంత ప్రాధాన్య పోస్టులు నిర్వహించిన ముగ్గురు ఉన్నతాధికారులకు (వీరిలో ఇద్దరు రిటైరు కాగా ఒకరు ఇంకా సర్వీసులో ఉన్నారు) బినామీలుగా వ్యవహరిస్తున్న నలుగురు పోలీసు అధికారులు ఏసీబీ రాడార్‌లో ఉన్నారని తెలుస్తోంది. దీనిపై పోలీసుశాఖలో జోరుగా చర్చ జరుగుతోంది. ‘ఆ నలుగురు పదిహేనేళ్ల క్రితం ఎలా ఉన్నారు? ఇపుడే స్థాయిలో ఉన్నారు? తెలంగాణ ఆవిర్భవించిన 2014 నుంచి వారి ఆస్తులు ఎలా పెరిగాయి? వారి జీవనశైలి ఏ విధంగా మారింది? కోట్లాది రూపాయల విలువైన లగ్జరీ విల్లాలను ఎలా కొనుగోలు చేశారు?’ అని మాట్లాడుకుంటున్నారు. పోలీసుశాఖలో ఎస్సైలుగా చేరి ప్రస్తుతం డీఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయిలో ఉన్న సదరు అధికారుల చరిత్ర ఏసీబీ సేకరించినట్లు తెలుస్తోంది. వీరు కొందరు అధికారులకు స్వయంగా బినామీలుగా ఉంటూనే.. తాము కొందరు బినామీలను ఏర్పాటు చేసుకొని అడ్డగోలుగా సంపాదించినట్లు సమాచారం.
ప్రభుత్వం మారగానే గప్‌చుప్!
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. పోలీసు శాఖలోని బినామీలు చాలావరకు లూప్‌లైన్ పోస్టుల్లోకి మెల్లిగా జారుకున్నారు. తమ మీద ఎవరి దృష్టి పడకుండా, అంతకుముందటి పదేళ్ల గుట్టు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, అక్రమార్జన కేసుల్లో పూర్తి స్థాయిలో సమాచారం సేకరించాలని ఏసీబీకి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో.. గత రెండున్నరేళ్లుగా ఏసీబీ బృందాలు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన బడా అధికారుల వివరాలను సేకరిస్తున్నాయి. పలువురికి సంబంధించిన ఫైళ్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భీంరెడ్డి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసు విభాగంతోపాటు రెవెన్యూ శాఖలోనూ కొందరు ఉన్నతాధికారులు నమ్మకమైన వారిని బినామీలుగా పెట్టుకుని వందల కోట్ల ఆస్తులను కూడబెట్టారని ఆరోపణలున్నాయి. తాజా ఉదంతంతో వీరంతా తమ గాడ్‌ఫాదర్స్ వద్దకు పరుగులు తీసినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.