ఏడుగురిలో ఐదుగురిపై ఏసీబీ ఫోకస్
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:10 AM
రిజిస్ట్రేషన్ల శాఖలో ఇతర జోన్ల నుంచి హైదరాబాద్ జోన్లకు బదిలీపై వచ్చిన ఏడు సబ్ రిజిస్ట్రార్లలో ఐదుగురిపై సోదాలు సాగడం హాట్ టాపిక్‌గా మారింది.
ప్రత్యేక జీవో ద్వారా హైదరాబాద్‌కు ఏడుగురు సబ్ రిజిస్ట్రార్ల బదిలీ
6న మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్
రూ. 50 కోట్లకు పైగా అక్రమాస్తులు
హైదరాబాద్, జనవరి 24 (ఆంధ్ర జ్యోతి): రిజిస్ట్రేషన్ల శాఖలో ఇతర జోన్ల నుంచి హైదరాబాద్ జోన్లకు బదిలీపై వచ్చిన ఏడు సబ్ రిజిస్ట్రార్లలో ఐదుగురిపై సోదాలు సాగడం హాట్ టాపిక్‌గా మారింది. వారిలో ఈ నెల 6న సస్పెన్షన్‌కు గురైన రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్-2 కె.మధుసూదన్ రెడ్డి రూ.50 కోట్లకు పైగా అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రత్యేక జీవో ద్వారా ఆయనతోపాటు మరో ఆరుగురు సబ్ రిజిస్ట్రార్‌లను 2024 జూలైలో బదిలీ చేసి కోర్ అర్బన్ పరిధిలోని కీలక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నియమించారు. ప్రస్తుతం మధుసూదన్‌రెడ్డిపై ఏసీబీ విచారణ జరుగుతుండగా.. ఇటీవల కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేర్‌లింగంపల్లి, గండిపేట సబ్ రిజిస్ర్టార్ల కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు జరిగాయి.
2 బోగస్ సేల్ డీడ్‌లతో ఒకే రోజు రిజిస్ట్రేషన్
ఈ నెల 6న సస్పెన్షన్‌కు గురైన మధుసూదన్ రెడ్డి ఒకే రోజు 2 బోగస్ డాక్యుమెంట్లను రిజిస్టర్ చేసినట్లు ఏసీబీ విచారణలో తేలింది. గతేడాది సెప్టెంబరు 29న ‘311/1967’ అనే నకిలీ మదర్ డాక్యుమెంటు ఆధారంగా రంగారెడ్డి జిల్లా శేర్‌లింగంపల్లి మండలం మక్తా మహబూబ్‌పేటలోని 44వ సర్వే నంబర్‌లోని 43 ఎకరాల భూమిని 14380/2025 సేల్ డీడ్ డాక్యుమెంట్ ప్రకారం ఆయన రిజిస్ట్రేషన్ చేశారు. అదే రోజు దీంతోపాటు 87/2025 క్రైం నంబరు ఈవోడబ్లూ కేసులో గచ్చిబౌలిలో నకిలీ జీపీఏ సృష్టించి.. 14381/2025 సేల్ డీడ్ డాక్యుమెంట్ ప్రకారం రిజిస్టర్ చేశారు. మధుసూదన్ రెడ్డి అక్రమాస్తులపై విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు.. గతంలో ఆయన పని చేసిన అన్ని ప్రాంతాల్లో సంపాదించిన అక్రమాస్తుల వివరాలను సేకరిస్తున్నారని సమాచారం.