Share News

పట్టించిన ఆస్తుల పంపకం!

ABN , Publish Date - Jul 06 , 2026 | 03:10 AM

ఎంతో పవిత్రంగా భావించే చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎందుకైనా మంచిదని తన ఆస్తులు, బినామీల పేరిట ఉన్న ఆస్తులు, ఎవరెవరి వద్ద నుంచి తనకు..

పట్టించిన ఆస్తుల పంపకం!

  • చార్‌ధామ్‌ యాత్రకు ముందు బినామీలు, ఆస్తుల లెక్క రాసిన డీఎస్పీ

  • కుటుంబీకులకు పంపకాలు.. వాట్సాప్‌లో కుమారులకు ఆ వివరాలు

  • దాడుల్లో డైరీని, వాట్సాప్‌లో పంపిన వివరాలను గుర్తించిన ఏసీబీ

  • డీఎస్పీ భీమ్‌రెడ్డిని ఏసీబీ అరెస్టు చేయకపోవడంపై కలకలం

  • అనారోగ్యానికి గురయ్యారంటూ నోటీసులిచ్చి వదిలేయడంపై చర్చ

  • భారీగా ఆస్తులు గుర్తించినా అరెస్టు చేయకపోవడమేంటని ప్రశ్నలు

  • భవిష్యత్‌లో అక్రమాస్తుల కేసులపై తీవ్ర ప్రభావం చూపుతుందని న్యాయనిపుణుల అభిప్రాయం

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఎంతో పవిత్రంగా భావించే చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎందుకైనా మంచిదని తన ఆస్తులు, బినామీల పేరిట ఉన్న ఆస్తులు, ఎవరెవరి వద్ద నుంచి తనకు ఎంతెంత సొమ్ము రావాలి, ఎవరెవరికి ఏమేం ఇవ్వాలనే వివరాలన్నీ ఓ డైరీలో రాసుకున్నారు. అంతేకాదు తనకేదైనా అయితే.. ఆ ఆస్తులు ఎవరెవరికి, ఎంతెంత చెందాలో కూడా రాశారు. ఈ వివరాలను ఫొటో తీసి వాట్సాప్‌లో తన ఇద్దరు కుమారులకు పంపారు. ఆ డైరీ, వాట్సాప్‌లో పంపిన ఫొటోలతో భారీ ఆస్తుల గుట్టు రట్టయింది. రెండు రోజుల క్రితం ఏసీబీకి పట్టుబడిన పోలీసు కంప్యూటర్‌ సర్వీసెస్‌ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి వ్యవహారంలో ఆసక్తికర అంశమిది. మే నెల రెండో వారంలో తన భార్యతో కలిసి చార్‌ధామ్‌ (యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌) యాత్రకు వెళ్లిన భీమ్‌రెడ్డి.. అంతకుముందే తన ఆస్తులు, పంపకాల వివరాలన్నీ రాసుకున్నారు. అయితే తన ఇద్దరు కుమారులు, భార్యతోపాటు ఇద్దరు బయటి వ్యక్తులకు కూడా ఆస్తులను పంచాలని ఆయన రాసినట్టు తెలిసింది. వీరిలో గతంలో భీమ్‌రెడ్డి వద్ద పనిచేసిన కానిస్టేబుల్‌ పురంధర్‌రెడ్డి, ఒక రాజకీయ నేత ఉన్నట్టు సమాచారం. ఈ ఇద్దరికీ గణనీయంగానే ఆస్తులను అప్పగించాలని రాసినట్టు తెలిసింది. అయితే ఏసీబీ దాడుల్లో ఆస్తుల పత్రాలతోపాటు భీమ్‌రెడ్డి రాసిన డైరీ, ఆయనతోపాటు కుటుంబ సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో డైరీలో రాసిపెట్టిన అంశాల ఫొటోలను గుర్తించినట్టు సమాచారం. ఆ వివరాల ఆధారంగానే ఏసీబీ అధికారులు బినామీల నివాసాల్లోనూ తనిఖీలు చేసి.. సుమారు రూ. వందల కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు.


ఏ ఆస్తులు ఎవరెవరికనే వివరాలన్నీ..

ఏసీబీ వర్గాల సమాచారం ప్రకారం.. తనపేరిట, బినామీల పేరిట ఉన్న ఆస్తులను ఏం చేయాలనే వివరాలన్నీ భీమ్‌రెడ్డి డైరీలో రాసిపెట్టారు. ఒక వాచ్‌మన్‌ పేరిట ఉన్న తెల్లాపూర్‌లోని 2 ఫ్లాట్లను, మణికొండ ల్యాంకోహిల్స్‌ రోడ్‌లో 500 గజాల స్థలంలో నిర్మించిన ఆరంస్తుల భవనంలో వాటాను కుటుంబ ఉమ్మడి ఆస్తిగా ఉంచాలని భీమ్‌రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి టెలికం నగర్‌లో ఉన్న జీప్లస్‌2 భవనాన్ని ఓ సమీప బంధువు పేరిట తాత్కాలికంగా మార్చాలని రాశారు. జహీరాబాద్‌లో, దాని సమీపంలో కర్ణాటకలో ఉన్న 45 ఎకరాలు, వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌లో ఉన్న రెండెకరాలు, ముచ్చింతల్‌లో ఉన్న 4.2 ఎకరాల భూమిని ఒక మాజీ హోంగార్డు పేరిట కొనసాగించాలని పేర్కొన్నారు. తనకు బయటి నుంచి రావాల్సిన సొమ్ము వివరాల్లో.. ఒక వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టిన రూ.2 కోట్లు, ఒక విల్లా కొనుగోలు కోసం ముందస్తుగా చెల్లించిన రూ.60 లక్షల వివరాలను రాశారు. బినామీలు, ఆస్తుల వివరాలే కాకుండా.. ఆ ఆస్తుల కొనుగోళ్లలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వారి పేర్లనూ భీమ్‌రెడ్డి రాసిపెట్టారు. అవసరమైతే వారిని సంప్రదించాలని కుటుంబసభ్యులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆ మధ్యవర్తులను కూడా విచారించేందుకు ఏసీబీఅధికారులు సిద్ధమైనట్టు తెలిసింది.

అరెస్టు చేయకపోవడంపై కలకలం

డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసు దర్యాప్తు కోణంలోనే కాకుండా న్యాయపరమైన చర్చకూ తెరలేపింది. అక్రమార్జన, ట్రాప్‌ కేసుల్లో ఏసీబీ అధికారులు ముందస్తు సమాచారం సేకరించి ఉన్నతాధికారుల అనుమతితో ఎఫ్‌ఐఆర్‌ నమో దు చేస్తారు. తర్వాత అనుమానితుల ఇళ్లలో సోదాలు చేస్తారు. దొరికిన ఆధారాలను, నిందితులను కోర్టు ముందుకు తీసుకెళ్తారు. ఏసీబీ సోదాల సమయంలో నిందితులు అనారోగ్యంతో ఉన్నా, అస్వస్థతకు గురైనా.. కోర్టు ముందు ప్రవేశపెట్టాక, రిమాండ్‌ నిబంధనల ప్రకారం జైలు అధికారులు ఆస్పత్రికి తరలించాల్సి ఉంటుంది. కానీ భీమ్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేయలేదు. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ నోటీసులిచ్చి వదిలేశారు. దీనిపై పోలీసు, న్యాయవాద వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. భీమ్‌రెడ్డిని ఏ ఆస్పత్రికి తీసుకెళ్లారు? వైద్యులు ఏం చెప్పారు? ఇది మెజిస్ట్రేట్‌ అనుమతితో జరిగిందా? కోర్టుకు వైద్య నివేదికలు సమర్పించారా అన్న వివరాలేవీ ఏసీబీ అధికారులు వెల్లడించలేదు. ఈ తీరు భవిష్యత్తులో ఏసీబీ కేసులపై తీవ్రప్రభావం చూపే అవకాశముంద ని న్యాయ నిపుణులు చెబుతున్నారు. భీమ్‌రెడ్డి కేసులో అనుసరించిన తీరుపై సంబంధిత కోర్టు స్పందన కీలకంగా మారుతుందంటున్నారు. భ విష్యత్తులో ఏసీబీ నమోదు చేసే ట్రాప్‌, డీఏ కేసుల్లో నిందితులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ బెయిల్‌ లేదా ఇతర ఉపశమనాల కోసం కోర్టును ఆశ్రయించే అవకాశముందని చెబుతున్నారు. దాదాపు 200 కోట్లకుపైగా అక్రమాస్తులు కూడబెట్టిన భీమ్‌రెడ్డికి నోటీసుతో సరిపెట్టడం ఏసీబీకి సంకటంగా మారే అవకాశముందని పోలీసు వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

Updated Date - Jul 06 , 2026 | 03:10 AM