Share News

మీ సేవా కేంద్రాలపై ఏసీబీ మెరుపు దాడులు

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:24 AM

మీ సేవా కేంద్రాల్లో నిర్దేశించిన రుసుము కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) స్పందించింది.

మీ సేవా కేంద్రాలపై ఏసీబీ మెరుపు దాడులు

  • నిర్ణీత రుసుములకంటే అదనంగావసూళ్లు

  • పలు అక్రమాలు గుర్తించిన ఏసీబీ అధికారులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): మీ సేవా కేంద్రాల్లో నిర్దేశించిన రుసుము కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) స్పందించింది. పలు మీసేవా కేంద్రాలపై బుధవారం దాడులు నిర్వహించింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట, అల్వాల్‌, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, నారాయణగూడ, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌ ప్రాంతాల్లోని మీ సేవా కేంద్రాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు సిబ్బంది, దళారులను అడ్డం పెట్టుకుని వినియోగదారుల నుంచి అక్రమంగా డబ్బు కొల్లగొడుతున్నట్టు నిర్థారించారు. ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వం నిర్ణయించిన రుసుముకన్నా ఎక్కువ మొత్తాలను వసూలు చేస్తున్నట్టు తేల్చారు. అల్వాల్‌ మీ సేవా కేంద్రంలో రంగారెడ్డి రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు మీ సేవ ద్వారా నేరుగా అందాల్సిన సేవలను దళారుల ద్వారా అందిస్తూ.. అందినకాడికి దండుకుంటున్నట్లు ఈ తనిఖీల్లో వెల్లడయ్యిందని ఆయన చెప్పారు. కుల, ఆదాయ, అఫిడవిట్‌లపై లబ్ధిదారుల పేర్లు రాయకుండానే సదరు అధికారులు సంతకం చేసిన సర్టిఫికెట్లు దాదాపు 70కి పైగా ఈ మీ సేవా కేంద్రం సమీపంలో ఉన్న ఫొటో కాపీ సెంటర్‌ వద్ద లభ్యమయ్యాయని చెప్పారు. అలాగే అంబర్‌పేట పోలీసుస్టేషన్‌ ఎదురుగా ఉన్న మీ సేవా కేంద్రాన్ని ఏసీబీ ఏసీపీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని మీ సేవా కేంద్రాన్ని ఉమ్మడి మెదక్‌ జిల్లా ఏసీబీ డీఎస్పీ కె.సుదర్శన్‌ ఆధ్వర్యంలో సీఐలు రమేష్‌, వెంకటేష్‌ తనిఖీ చేశారు. నిర్ణీత రుసుముకంటే ప్రతి షీట్‌కు రూ.10 ఎక్కువగా ఈ మీ సేవా కేంద్రం నిర్వాహకులు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారని గుర్తించినట్లు తెలిపారు.

Updated Date - Apr 16 , 2026 | 04:24 AM