ఆదాయానికి మించి 569 శాతం అక్రమాస్తులు
ABN , Publish Date - May 24 , 2026 | 05:16 AM
వాటర్‌బోర్డులో 23ఏళ్ల క్రితం సాధారణ ఉద్యోగిగా చేరిన జీఎం అనంత లక్ష్మీకుమార్ తన మొత్తం సర్వీసులో ఆదాయానికి మించి 569 శాతం అక్రమార్జనకు పాల్పడ్డారని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
వాటర్ బోర్డు జీఎం లక్ష్మీకుమార్‌పై ఎఫ్‌ఐఆర్‌లో ఏసీబీ విశ్లేషణ
హైదరాబాద్, మే23 (ఆంధ్రజ్యోతి): వాటర్‌బోర్డులో 23ఏళ్ల క్రితం సాధారణ ఉద్యోగిగా చేరిన జీఎం అనంత లక్ష్మీకుమార్ తన మొత్తం సర్వీసులో ఆదాయానికి మించి 569 శాతం అక్రమార్జనకు పాల్పడ్డారని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినపుడు ఏసీబీకి ఉన్న సమాచారం మేరకు.. అతను రూ.3,01,66,000 ఆస్తులు కూడబెట్టాడని పేర్కొంది. వాస్తవ అదాయం రూ.2.20 కోట్లు కాగా, కుటుంబ ఖర్చులు రూ.1.32 కోట్లుగా గుర్తించింది. దీని ప్రకారం అతను కూడబెట్టింది రూ.88 లక్షలు మాత్రమే ఉండాలి.. కానీ రూ.3,01,66,000 విలువైన ఆస్తులు ఉన్నాయి. దీంతో అనంత లక్ష్మీకుమార్ రూ.2,13,66,000 అక్రమార్జనకు పాల్పడినట్లు స్పష్టమవడంతో అదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశామని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కాగా అక్రమార్జనపై ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన అధికారులు.. ఈనెల 19వ తేదీన వివిధ ప్రాంతాల్లో సోదాలు చేసి అక్రమాస్తులను భారీగా వెలికి తీశారు. అనంత లక్ష్మీ కుమార్ ఇంట్లో దొరికిన రూ.1.10 కోట్ల నగదు, బంగారం, స్థిర చరాస్తులను బట్టి వాటి విలువను రూ.5,88,55,490 గా పేర్కొన్నారు. సోదాల్లో కొత్త విషయాలు వెలుగులోకి రావడంతో వీటిని కూడా రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు పొందుపరిచారు. తాజా విశ్లేషణ ప్రకారం నిందితుడు 569 శాతం అక్ర మార్జనకు పాల్పడినట్లు తేలింది.