ఏసీబీ వలలో సర్పంచ్ భర్త, పంచాయతీ కార్యదర్శి
ABN , Publish Date - May 12 , 2026 | 04:37 AM
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా సర్పంచ్ భర్త, పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
10 వేల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన నిందితులు
కొమురవెల్లి, మే 11 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా సర్పంచ్ భర్త, పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఒకరి ప్లాట్ నుంచి డ్రైనేజీ పైప్‌లైన్ వెళ్తోంది. దానిని తొలగించేందుకు పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజు రూ. 25 వేల లంచం డిమాండ్ చేశాడు. రూ. 20 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న బాధితుడు గతంలో రూ. 10 వేలు ఇచ్చాడు. మిగిలిన రూ. 10 వేలను సోమవారం పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ గొల్లపల్లి పద్మ భర్త గొల్లపల్లి ఆంజనేయులుకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ సమయంలో పంచాయతీ కార్యదర్శి కూడా కార్యాలయంలోనే ఉన్నాడు. కార్యదర్శికి, సర్పంచ్ భర్తకు మధ్య ఉన్న ఒప్పందం మేరకే లంచం డబ్బులను సర్పంచ్ భర్త తీసుకున్నట్లు ఏసీబీ మెదక్ రేంజ్ డీఏస్పీ సుదర్శన్ చెప్పారు.