లంచాధికారుల అరెస్టుతో సంబురం!
ABN , Publish Date - Jun 13 , 2026 | 06:39 AM
మహబూబాబాద్ జిల్లాలో లంచాలకు అలవాటుపడిన ఇద్దరు అధికారులు, వారికి సహకరించిన ఓ అధికారిణి కుమారుడు ఏసీబీ వలకు చిక్కారు. దీంతో స్థానిక ప్రజలు బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.
45వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన
ఎంపీడీవో, ఎంపీవో, ఎంపీడీవో కుమారుడు
బాణసంచా కాల్చిప్రజల సంబురాలు
మహబూబాబాద్ జిల్లాలో ఘటన
నర్సింహులపేట (మహబూబాబాద్ క్రైం), హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్ జిల్లాలో లంచాలకు అలవాటుపడిన ఇద్దరు అధికారులు, వారికి సహకరించిన ఓ అధికారిణి కుమారుడు ఏసీబీ వలకు చిక్కారు. దీంతో స్థానిక ప్రజలు బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వెంచర్ యజమాని నుంచి రూ.45 వేలు లంచం తీసుకుంటూ నర్సింహులపేట మండలం ఎంపీడీవో పెనుగొండ రాధిక, ఎంపీవో కిన్నెర యాకయ్యతోపాటు ఎంపీడీవో రాధిక కుమారుడు నాగార్జున శుక్రవారం ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. ఈ కేసుకు సంబంధించి వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సింహులపేట మండలంలోని పడమటిగూడెం గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నెంబరులో 797లోని 4ఎకరాల వ్యవసాయ భూమిని హైదరాబాద్‌కు చెందిన పుప్పాల సురేష్.. వెన్ను నర్సయ్య, వెన్ను వెంకన్న అనే రైతుల నుంచి కొనుగోలు చేసి ప్లాట్లుగా విక్రయించేందుకు వెంచర్ చేశారు. లే అవుట్ అనుమతి కోసం సురేష్.. 2025 జనవరి 29న వరంగల్ ఆర్‌డీడీలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆ భూమి పక్కన ఉన్న వెన్ను నర్సయ్య తనకు సర్వే నెంబరు 797లో 10 గుంటల భూమి ఉన్నట్లు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సర్వే చేయించినా భూమి తేలకపోవడంతో నర్సయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై స్థానిక ఎంపీడీవో, ఎంపీవో, కార్యదర్శికి కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ క్రమంలో లేఅవుట్ అనుమతికి, హైకోర్టులోని రిట్ పిటిషన్ ఉపసంహరణకు రూ.లక్ష లంచం ఇవ్వాలని ఎంపీడీవో, ఎంపీవోలు పుప్పాల సురేష్‌ను డిమాండ్ చేశారు. దీంతో సురేష్ ఎంపీడీవోకు రూ.30 వేలు, ఎంపీవోకు రూ.25 వేలు ఇచ్చారు. ఆ తర్వాత కూడా పని చేయని ఎంపీడీవో, ఎంపీవో మిగిలిన రూ.45 వేలు డిమాండ్ చేశారు. దీనిపై సురేష్.. మే నెలలో వరంగల్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు పక్కా ప్రణాళిక చేశారు. దాని ప్రకారం.. ఎంపీడీవో రాధిక రూ.20,000, ఎంపీవో కిన్నెర యాకయ్య రూ.25 వేలు మండల పరిషత్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ నగదు వ్యవహారాలు చూసుకుంటున్న ఎంపీడీవో రాధిక కుమారుడు నాగార్జునను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ముగ్గురిని వరంగల్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో శనివారం హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
బాణసంచా కాల్చి సంబురాలు..
నర్సింహులపేట ఎంపీడీవో రాధిక, ఎంపీవో యాకయ్య, ఎంపీడీవో కుమారుడు నాగార్జున ఏసీబీ అధికారులకు చిక్కడంతో స్థానిక ప్రజలు సంబురాలు చేసుకున్నారు. బీఆర్‌ఎస్ నాయకులు బండి రమేష్, మాజీ ఉప సర్పంచ్ కర్ల నాగన్న, మాజీ వార్డు సభ్యులు మదారు ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట బాణసంచా కాల్చారు. డబ్బు ఇవ్వకపోతే ఎంపీడీవో కార్యాలయంలో సిబ్బంది పనులు చేయరని, ఎంపీడీవో రాధిక తమను వేధిస్తున్నారని గ్రామప్రజలు పేర్కొన్నారు.