Share News

ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్‌ డీఈ

ABN , Publish Date - May 26 , 2026 | 05:25 AM

జనగామ జిల్లా పాలకుర్తి ఇరిగేషన్‌ డీఈ గంటి శ్రీకాంత్‌.. ఓ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఏసీబీకి చిక్కిన  ఇరిగేషన్‌ డీఈ

  • కాంట్రాక్టర్‌ నుంచి 50 వేలు తీసుకుంటుండగా పట్టివేత

వరంగల్‌ క్రైం, మే 25 (ఆంధ్రజ్యోతి): జనగామ జిల్లా పాలకుర్తి ఇరిగేషన్‌ డీఈ గంటి శ్రీకాంత్‌.. ఓ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కొడకండ్ల మండలం కన్వాయిగూడెంలో ఓ కాంట్రాక్టర్‌ 2022లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించాడు. ఆ సమయంలో ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న గంటి శ్రీకాంత్‌ బిల్లులు పాస్‌ చేసేందుకు లంచం డిమాండ్‌ చేస్తూ సాగదీసుకుంటూ వచ్చారు. ఇటీవలే డీఈగా పదోన్నతి పొందిన శ్రీకాంత్‌ను కాంట్రాక్టర్‌ బిల్లు పాస్‌ చేయాలని ప్రాధేయపడగా రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో కాంట్రాక్టర్‌ చివరికి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం ఉదయం పక్కా ప్లాన్‌ ప్రకారం.. హనుమకొండ భవానీనగర్‌లోని డీఈ నివాసంలో కాంట్రాక్టర్‌ రూ.50వేలు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు.

20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రికార్డు అసిస్టెంట్‌

బంజారాహిల్స్‌: ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన ఫైలును పైఅధికారుల వద్దకు పంపించేందుకు లంచం తీసుకుంటూ ప్రభుత్వ కార్యాలయ రికార్డు అసిస్టెంట్‌ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కాడు. విద్యాశాఖలో పనిచేసి రిటైర్‌ అయిన తన తల్లి పెన్షన్‌కు సంబంధించిన ఫైల్‌ క్లియరెన్సు కోసం కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి అమీర్‌పేటలోని ప్రభుత్వ పాఠశాలల డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శివానంద్‌ను ఆశ్రయించారు. ఆ ఫైలును ఉన్నతాధికారులకు పంపించేందుకు శివానంద్‌ రూ.20వేల లంచం డిమాండ్‌ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన అధికారులు సోమవారం కార్యాలయంలో బాధితుడి నుంచి శివానంద్‌ నగదు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Updated Date - May 26 , 2026 | 05:25 AM