పొలాలకు తరలించే చెరువు మట్టికి 4 లక్షల లంచం
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:33 AM
చెరువు మట్టిని తన పొలానికి తోలుకునేందుకు అనుమతులు కోరిన రైతు నుంచి లంచం తీసుకున్న నీటిపారుదల శాఖ ఇంజినీరు ఏసీబీకి చిక్కారు.
ఏసీబీకి చిక్కిన నీటిపారుదలశాఖ ఏఈ
అశ్వారావుపేట/అశ్వారావుపేట రూరల్, జూన్ 29(ఆంధ్రజ్యోతి): చెరువు మట్టిని తన పొలానికి తోలుకునేందుకు అనుమతులు కోరిన రైతు నుంచి లంచం తీసుకున్న నీటిపారుదల శాఖ ఇంజినీరు ఏసీబీకి చిక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలను ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అశ్వారావుపేట పట్టణంలోని భద్రాచలం రోడ్‌లోని దొంతికుంట చెరువు నుంచి తన వ్యవసాయ భూమిలోకి మట్టిని తోలుకునేందుకు ఓ రైతు ఇటీవల నీటిపారుదలశాఖ ఏఈ శ్రీనివాస్‌ను సంప్రదించాడు. ఆ మట్టిని తోలుకోవాలంటే తనకు రూ.4లక్షలు లంచం ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశారు. దాంతో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించి.. ఏఈతో మాట్లాడిన ఫోన్ సంభాషణలు, ఇతర వివరాలను అందజేశాడు. ఆ తర్వాత వారి సూచనలు, పథకం ప్రకారం.. మరోమారు ఆ రైతు ఏఈ శ్రీనివాస్‌ను కలవగా చివరకు రూ.2లక్షలకు ఒప్పందం కుదిరింది. ఆ సొమ్ము తీసుకొని తన కార్యాలయానికి రావాలని శ్రీనివాస్ సూచించారు. దాంతో సోమవారం సాయంత్రం ఆ నగదు తీసుకుని కార్యాలయానికి వచ్చి ఏఈ శ్రీనివా్‌సకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈని అదుపులోకి తీసుకుని కార్యాలయంలోనూ, నివాసంలోనూ సోదాలు చేశారు.