Share News

Red Handed Taking Bribes: ఏసీబీ వలలో అవినీతి అధికారులు

ABN , Publish Date - Jan 09 , 2026 | 04:46 AM

పని నిమిత్తం ఆఫీసుకు వచ్చిన వారిని డబ్బులు డిమాండ్‌ చేసిన ఇద్దరు అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. బాధితుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెండ్‌గా దొరికారు.

Red Handed Taking Bribes: ఏసీబీ వలలో అవినీతి అధికారులు

  • మిల్లర్‌ నుంచి రూ.50 వేలు తీసుకుంటూ చిక్కిన..వనపర్తి జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌

  • కలెక్టరేట్‌ ముందు బాణసంచా కాల్చిన మిల్లర్లు

  • పేకాట నిందితుల నుంచి రూ.30 వేలు లంచం

  • రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన కేయూ ఎస్సై శ్రీకాంత్‌

వనపర్తి/వరంగల్‌ క్రైం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): పని నిమిత్తం ఆఫీసుకు వచ్చిన వారిని డబ్బులు డిమాండ్‌ చేసిన ఇద్దరు అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. బాధితుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెండ్‌గా దొరికారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) కేటాయింపు విషయంలో ఓ మిల్లర్‌ వనపర్తి జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ జగన్మోహన్‌ను ఆశ్రయించారు. దీంతో ఆయన ధాన్యం కేటాయింపునకు రూ.లక్షా 70 వేలు డిమాండ్‌ చేశారు. మిల్లర్‌ అంత ఇవ్వలేనని చెప్పడంతో.. డబ్బులు లేనిదే పని జరగదని ఆ అధికారి తెగేసి చెప్పారు. దీంతో మిల్లర్‌ రూ.50 వేలు ఇస్తానని చెప్పి, ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఒప్పందం ప్రకారం మిల్లర్‌ నుంచి ఆ అధికారి గురువారం రాత్రి 8 గంటల సమయంలో కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రూ.50 వేలు తీసుకున్నారు. అనంతరం కారులో బయలుదేరారు. కలెక్టరేట్‌ ముందు కారును అడ్డుకున్న ఏసీబీ అధికారులు మేనేజర్‌ జగన్మోహన్‌, కారు డ్రైవర్‌ లావుడ్య లక్ష్మణ్‌ నాయక్‌ను అరెస్టు చేశారు. జగన్మోహన్‌ ఏసీబీకి పట్టుబడ్డారన్న విషయం తెలియడంతో రైస్‌ మిల్లర్లు కలెక్టరేట్‌ ముందు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. గత జనవరిలో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మిల్లర్లతో పాటు కిందిస్థాయి ఉద్యోగులను వేధిస్తూ అక్రమాలకు పాల్పడ్డాడని మిల్లర్లు మండిపడుతున్నారు. మరో కేసులో, లంచం తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీకి చిక్కారు. డిసెంబరు 29న హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ(కేయూ) పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని గోపాలపూర్‌లో పేకాట ఆడుతూ పలువురు పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, చార్జ్‌షీట్‌ వేగంగా దాఖలు చేయడంతో పాటు నోటీసు జారీ చేయడం, వాహనాలను తిరిగి ఇచ్చేందుకు ఎస్సై పోగుల శ్రీకాంత్‌ నిందితుల నుంచి రూ.30 వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో వారు రూ.15 వేలు ఇచ్చారు. అయితే, మిగతా డబ్బుల కోసం ఎస్సై ఒత్తిడి చేస్తుండటంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయుంచారు. గురువారం ఎస్సై శ్రీకాంత్‌ తన దగ్గర పని చేసే ప్రైవేటు డ్రైవర్‌ నజీర్‌ ద్వారా రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Updated Date - Jan 09 , 2026 | 04:46 AM