Share News

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆనంద్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

ABN , Publish Date - May 21 , 2026 | 03:58 AM

వరంగల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌-2గా పనిచేస్తూ అవినీతి ఆరోపణలతో సస్పెండైన దావులూరి ఆనంద్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల...

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆనంద్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

  • ఏసీబీ సోదాల్లో రూ.20 కోట్లకు పైగా విలువైన ఆస్తుల గుర్తింపు..

హైదరాబాద్‌/హనుమకొండ టౌన్‌/బోయినపల్లి, మే 20 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌-2గా పనిచేస్తూ అవినీతి ఆరోపణలతో సస్పెండైన దావులూరి ఆనంద్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసును నమోదు చేశారు. బుధవారం వివిధ ప్రాంతాల్లోని ఆనంద్‌ నివాసాలు, ఆయన సన్నిహితులు, బినామీల ఇళ్లల్లో సోదాలు నిర్వహించామని ఏసీబీ డీజీ చారుసిన్హా తెలిపారు. ఖమ్మంలోని ఆనంద్‌ ఇంట్లో జరిపిన సోదాల్లో రెండు ఇళ్లు, ఆరు ఇళ్ల స్థలాలకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నామని, వీటి రిజిస్ట్రేషన్‌ విలువ రూ.99,93,708 అని, వాస్తవ విలువ 20 రెట్లు పైగానే ఉంటుందని వెల్లడించారు. ఆనంద్‌ ఇంట్లో రూ.24,50,450 నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.7,05,367 ఉన్నట్లు గుర్తించామన్నారు. దాదాపు కిలో బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులున్నాయని, గృహోపకరణాల విలువ రూ.6,07,700 ఉంటుందని, ఒక కారు, బైక్‌ విలువ రూ.13,25,000గా గుర్తించామని వివరించారు. ఆనంద్‌ అక్రమార్జన రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం రూ.1,94,01,765 ఉంటుందని, వాస్తవ విలువ రూ.20 కోట్లకు పైగానే ఉండొచ్చని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. అవినీతి ఆరోపణలతో గత ఏప్రిల్‌ 2న ఆనంద్‌ నివాసంలో ఓసారి సోదాలు నిర్వహించామని.. అనంతరం ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందని పేర్కొన్నారు.

రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై, కానిస్టేబుల్‌..

రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఓ మహిళా ఎస్సై, కానిస్టేబుల్‌ ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన హైదరాబాద్‌ బోయినపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఓల్డ్‌ బోయిన్‌పల్లికి చెందిన అభిషేక్‌కు అతడి తండ్రికి మధ్య వివాదాలు తలెత్తగా.. అభిషేక్‌ తండ్రిపై చేయిచేసుకున్నాడు. దీంతో అభిషేక్‌పై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే అభిషేక్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం అతడికి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ప్రతి సోమవారం అభిషేక్‌ ఠాణాకు వచ్చి సంతకం పెట్టాల్సి ఉండగా.. వచ్చిన ప్రతిసారి రోజంతా పోలీసులు ఇబ్బందులకు గురిచేశారు. ఈ నేపథ్యంలోనే కానిస్టేబుల్‌ విజయ్‌ అతడిని సంప్రదించి స్టేషన్‌కు రాకుండా ఉండేందుకు ఎస్సై నందితకు రూ.15 వేలు ఇస్తే సరిపోతుందని చెప్పాడు. దీంతో అతడు ఎస్సై నందితను సంప్రదించగా.. ఆమె రూ.30 వేలు కావాలని డిమాండ్‌ చేశారు. ఇది ఇష్టం లేని అభిషేక్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈక్రమంలోనే అభిషేక్‌ డబ్బులతో ఠాణాకు రాగా.. అక్కడి పరిసరాల్లోని తన ద్విచక్ర వాహనం డిక్కీలో డబ్బులు పెట్టి తాళంచెవిని తనకు ఇవ్వమని ఎస్సై నందిత చెప్పారు. తాళం చెవిని అభిషేక్‌ నుంచి నందిత తీసుకోగానే ఏసీబీ అధికారులు ఆమెతో పాటు కానిస్టేబుల్‌ విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - May 21 , 2026 | 03:58 AM