డిప్యూటీ కలెక్టర్ అక్రమాస్తులు 100 కోట్లు
ABN , Publish Date - May 23 , 2026 | 05:21 AM
అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ)కి మరో భారీ అవినీతి అధికారి చిక్కాడు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అర్బన్ లాండ్ సీలింగ్ విభాగం డిప్యూటీ కలెక్టర్ మర్రి వంశీమోహన్....
ఏసీబీకి చిక్కిన మేడ్చల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్
19 ఇళ్ల స్థలాలు, వనస్థలిపురంలో ఇల్లు, లగ్జరీ ఫ్లాట్లు గుర్తింపు
రెండెకరాల ఫాంహౌస్.. బ్యాంకుల్లో రూ.20 లక్షల డిపాజిట్లు
బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.100 కోట్లకు పైమాటే..
తన మామ పేరిట 8 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్
దానిని ఓ రియల్టర్‌కు ఇచ్చి బదులుగా 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్
వంశీమోహన్ అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు
హైదరాబాద్/వనస్థలిపురం/హయత్‌నగర్, మే22 (ఆంధ్రజ్యోతి): అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ)కి మరో భారీ అవినీతి అధికారి చిక్కాడు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అర్బన్ లాండ్ సీలింగ్ విభాగం డిప్యూటీ కలెక్టర్ మర్రి వంశీమోహన్ రూ.100 కోట్లకుపైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. అక్రమాస్తులకు సంబంధించి ఫిర్యాదులు రావటంతో ఏసీబీ డీఎస్పీ లక్ష్మీకాంత్‌రెడ్డి నేతృత్వంలో శుక్రవారం ఉదయం 5 గంటల నుంచే వంశీమోహన్ ఇల్లు, ఆయన బంధువుల నివాసాలు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సహా 9 చోట్ల సోదాలు నిర్వహించారు. ఆర్డీవోగా పనిచేసిన సమయంలో వంశీమోహన్ ప్రభుత్వ ఆస్తులను పెద్ద ఎత్తున కొట్టేశారని వచ్చిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. వంశీమోహన్‌కు హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో రూ.4,46,28,000 విలువైన 19 ఇళ్ల స్థలాలు, వనస్థలిపురంలో విలాసవంతమైన ఇల్లు, మణికొండలో 1,000 చదరపు అడుగుల ఫ్లాట్, మజీద్‌బండలోని లగ్జరీ విల్లాల్లో 2,000 చదరపు అడుగుల ఫ్లాట్, ఇబ్రహీంపట్నం సమీపంలోని నారేపల్లిలో రెండు ఎకరాల ఫాంహౌస్ ఉన్నట్లు సోదాల్లో గుర్తించారు. ఆయన బ్యాంకు ఖాతాల్లో రూ.20 లక్షలు, నివాసంలో రూ.2,10,800 నగదు, 122 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ఖరీదైన కార్లు కూడా సోదాల్లో బయటపడ్డాయి. వీటి రిజిస్ట్రేషన్ విలువ రూ.6,22,38,800 ఉంటుందని, వాస్తవ మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. బ్యాంకు లాకర్లను ఇంకా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. కేసు నమోదుచేసి వంశీమోహన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. వంశీమోహన్ 2019 నుంచి 2023 వరకు శేరిలింగంపల్లి ఎమ్మార్వోగా పనిచేసిన సమయంలో జరిగిన భూముల అనుమానాస్పద బదిలీలపై తమకు ఫిర్యాదులు అందాయని డీఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. కస్టడీ పిటిషన్ దాఖలు చేసి త్వరలో ఆయనను విచారిస్తామని చెప్పారు.
రక్షకుడే భక్షకుడు
అబ్దుల్లాపూర్ మెట్ పిగ్లిపురంలో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని వంశీమోహన్ కాజేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ భూమిని తన మామ విజయభాస్కర్ పేరు మీద రిజిస్ర్టేషన్ చేయించి, ఆ తర్వాత ఒక రియల్టర్‌కు బదలాయించినట్లు గుర్తించారు. సదరు రియల్టర్ నుంచి హయత్‌నగర్ పరిధిలోని సాహెబ్‌నగర్‌లో 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ చేయించుకుని.. బదులుగా పిగ్లిపురంలోని 8 ఎకరాలు అప్పగించినట్లు గుర్తించారు. హయత్‌నగర్ సంగం హోటల్ వెనుక నివాసం ఉండే ఆ రియల్టర్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సాహెబ్‌నగర్ పరిధిలోని సర్వేనంబర్ 71/2లో 222 గజాల చొప్పున ఉన్న నాలుగు ప్లాట్లను వంశీమోహన్ అక్రమంగా జీవో నంబర్ 118 ప్రకారం రెగ్యులరైజ్ చేయించుకున్నట్లు తెలిసింది. ఆ ప్లాట్లు ఎవరి పేరుతో ఉన్నాయో తెలుసుకునేందుకు హయత్‌నగర్ మండల రెవెన్యూ కార్యాలయంలోని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రెగ్యులరైజ్ చేసిన అధికారుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించినట్లు సమాచారం.