Share News

2 లక్షలు లంచం.. తహసీల్దార్‌ అరెస్టు

ABN , Publish Date - May 27 , 2026 | 04:30 AM

మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోని శామీర్‌పేట తహస్దీలార్‌, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ సుచరిత ఏసీబీ వలలో చిక్కారు. రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

2 లక్షలు లంచం.. తహసీల్దార్‌ అరెస్టు

  • ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన శామీర్‌పేట తహసీల్దార్‌ సుచరిత.. నాలా కన్వర్షన్‌కు 30 లక్షలు డిమాండ్‌

  • తొలి విడత కింద రూ.2 లక్షలు

  • తన వ్యక్తిగత వాహనం డ్రైవరు ద్వారా తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ

  • ఇదే కేసులో కీసర ఆర్‌డీఓను ప్రశ్నిస్తున్న అధికారులు

హైదరాబాద్‌, శామీర్‌పేట, మే 26 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోని శామీర్‌పేట తహస్దీలార్‌, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ సుచరిత ఏసీబీ వలలో చిక్కారు. రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. 30 ఎకరాల భూమి నాలా కన్వర్షన్‌కు సంబంధించిన ఫైలును ఆమోదించటానికి.. ఎకరానికి రూ.లక్ష చొప్పున రూ.30 లక్షలు సుచరిత డిమాండ్‌ చేశారని ఏసీబీకి ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ట్రాప్‌ ఏర్పాటు చేశారు. సుచరిత తన ప్రైవేటు కారు డ్రైవర్‌ నగేష్‌ ద్వారా మొదటి వాయిదా కింద రూ.2 లక్షలు తీసుకుంటున్న క్రమంలో మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని వారిద్దరినీ అరెస్టు చేశారు. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. శామీర్‌పేట మండలం అలియాబాద్‌ ప్రాంతంలోని ఒక రైతు తన వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్‌ చేయించడానికి ఒక కన్సల్టెంట్‌ ద్వారా తహస్దీలార్‌ సుచరితను కలిశారని తెలిపారు. ఆమె రూ.30 లక్షలు డిమాండ్‌ చేయటంతో రైతు ఏసీబీలో ఫిర్యాదు చేశారన్నారు. ఈ క్రమంలో సుచరితను అరెస్టు చేయటంతోపాటు శామీర్‌పేట తహస్దీలార్‌ కార్యాలయంలోని భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నామన్నారు. అవినీతి వ్యవహారంలో మరెవరిదైనా పాత్ర ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని, కీసర ఆర్‌డీఓ రాజేష్‌తో పాటు పలువురు సిబ్బందిని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. కాగా, ఇదే శామీర్‌పేట తహస్దీలార్‌ కార్యాలయంలో పనిచేసిన ఎమ్మార్వో సత్యనారాయణ 2024లో రూ.2 లక్షల లంచం తీసుకుంటూ తన డ్రైవర్‌తోసహా ఏసీబీకి చిక్కటం అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి అదే కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.


మరెన్నో కేసులు..

రెవెన్యూ శాఖలో అవినీతికి సంబంధించి ఇది తాజా కేసు కాగా.. ఇదే నెలలో శంషాబాద్‌ తహస్దీలార్‌ రవీందర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అధికారులు ఆయన కారులో డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జరిపిన విచారణలో దాదాపు రూ.వెయ్యి కోట్ల భూమికి రవీందర్‌ ఎసరు పెట్టినట్లు ప్రభుత్వవర్గాలు గుర్తించాయి. భూముల మ్యుటేషన్లు, నాలా కన్వర్షన్లు, సర్వే రిపోర్టులు, రిజిస్ట్రేషన్‌ వ్యవహారాల్లో రెవెన్యూ సిబ్బంది భారీగా డబ్బు డిమాండ్‌ చేస్తున్నారని ఏసీబీకి ఫిర్యాదులు వస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో నల్లగొండ జిల్లా చిట్యాల తహస్దీలార్‌ గూగులోత్‌ కృష్ణను.. మ్యుటేషన్‌ వ్యవహరంలో రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా అరెస్టు చేశారు. సికింద్రాబాద్‌ తహస్దీలార్‌ కార్యాలయంలో మండల సర్వేయర్‌, చైన్‌మెన్‌ కలిసి ఒక సర్వేకు సంబంధించి రూ.3 లక్షలు డిమాండ్‌ చేసి రూ.1 లక్ష అడ్వాన్స్‌ తీసుకుంటుండగా పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ గోపాల కృష్ణ.. పట్టాదార్‌ పాస్‌బుక్‌లో భూమి నమోదు కోసం రూ.12 వేలు లంచం తీసుకుంటూ దొరికాడు. ముషీరాబాద్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ భూపాల్‌.. ధ్రువపత్రాల జారీకి లంచం డిమాండ్‌ చేసి చిక్కాడు. తన వ్యక్తిగత వాహనం డ్రైవరు ద్వారా లంచం తీసుకుంటూ మహబూబాబాద్‌ తహస్దీలార్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ విధంగా భూమి పాస్‌బుక్కులు, ధరణి ఎంట్రీలు, సర్వే నెంబర్లు, వారసత్వ మార్పులు, నాలా అనుమతులు వంటి అంశాల్లో ప్రతి దశలో రెవెన్యూ ఉద్యోగులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయని ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు. భూముల విలువలు భారీగా పెరగడం, ధరణి వ్యవస్థలో నెలకొన్న సమస్యలు, రిజిస్ట్రేషన్లు, కన్వర్షన్లలో రెవెన్యూ అధికారులకు కీలక విచక్షణాధికారం ఉండటం.. రెవెన్యూశాఖలో తీవ్రమైన అవినీతికి కారణాలని విశ్లేషించారు. దీనిపై ఇటీవలే ఏసీబీ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా అందజేసినట్లు సమాచారం.

Updated Date - May 27 , 2026 | 04:30 AM