Share News

ఏసీబీ వలలో నలుగురు ప్రభుత్వోద్యోగులు

ABN , Publish Date - Feb 21 , 2026 | 02:48 AM

రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో లంచం తీసుకుంటూ ఒక ప్రైవేటు వ్యక్తితోపాటు ఐదుగురు వ్యక్తులు శుక్రవారం ఏసీబీకి చిక్కారు. వారిలో

ఏసీబీ వలలో నలుగురు ప్రభుత్వోద్యోగులు

  • ప్రైవేట్‌ డాక్యుమెంట్‌ రైటర్‌ కూడా..

  • పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో ఘటనలు

మంథని/భూపాలపల్లి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో లంచం తీసుకుంటూ ఒక ప్రైవేటు వ్యక్తితోపాటు ఐదుగురు వ్యక్తులు శుక్రవారం ఏసీబీకి చిక్కారు. వారిలో ఒకరు సబ్‌ రిజిస్ట్రార్‌, ఒక కోర్టు ఇన్‌చార్జి అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి, ఇద్దరు ఉద్యోగులు, ప్రైవేటు డాక్యుమెంట్‌ రైటర్‌ ఉన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం పుట్టపాక వాసి కన్నూరి బాపు.. తమ గ్రామంలోని ఓ స్థలం రిజిస్ట్రేషన్‌ కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ కాసర్ల రాజేందర్‌ను ఆశ్రయిస్తే రూ.35 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. తాను అంత ఇవ్వలేనన్న ఒత్తిడి చేస్తుండటంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం సబ్‌ రిజిస్ట్రార్‌ కాసర్ల రాజేందర్‌, ప్రైవేట్‌ డాక్యుమెంట్‌ రైటర్‌ రషీద్‌లకు రూ.16 వేలు ఇస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ కరీంనగర్‌ డీఎస్పీ మధు తెలిపారు. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లి రైతు 14.02 ఎకరాల భూమి హక్కులపై గోపాలరావు, మరొక రైతు కోర్టునాశ్రయించారు. భూపాలపల్లి మున్సిఫ్‌ కోర్టులో గోపాలరావుకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీనిపై జిల్లా ప్రిన్సిపల్‌ కోర్టును ఆశ్రయించిన గోపాలరావుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ విషయమై క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ జారీ చేయమని కోరిన గోవిందరావును కోర్టు ఇన్‌చార్జి అడ్మినిస్ట్రేషన్‌ అధికారి సాయిచరణ్‌ రూ.20 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. అంత ఇవ్వలేనని గోపాలరావు అనడంతో కనీసం రూ.5,000 అయినా ఇవ్వాలని సాయిచరణ్‌ చెప్పాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన గోపాలరావు వారి సూచన మేరకు శుక్రవారం కోర్టు ఆవరణలో సాయి చరణ్‌కు ఇవ్వడానికి ప్రయత్నించగా, ఇద్దరు కోర్టు సిబ్బంది పున్నం రజిత, కొమ్ము సునీతలకు ఇవ్వమన్నాడు. వారికి గోపాలరావు డబ్బు ఇస్తుండగా, రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. తాము సాయి చరణ్‌ ఆదేశాల మేరకే డబ్బు తీసుకున్నామని రజిత, సునీత చెప్పారు. దీంతో సాయిచరణ్‌, రజిత, సునీతలను అరెస్టు చేశామని సాంబయ్య చెప్పారు.

Updated Date - Feb 21 , 2026 | 02:48 AM