డీఎస్పీ ఆస్తులు రూ.200 కోట్లు
ABN , Publish Date - Jul 03 , 2026 | 06:46 AM
పోలీసుశాఖలో అతి భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. పోలీసుశాఖలో సాధారణ కానిస్టేబుల్‌గా చేరి, రాతపరీక్షతో ఎస్సైగా ఎంపికై డీఎస్పీ స్థాయికి చేరిన..
పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగం డీఎస్పీ భీమ్‌రెడ్డిని అరెస్టు చేసిన ఏసీబీ
భీమ్‌రెడ్డి, ఆయన బంధువులు, బినామీల నివాసాలు కలిపి 16 చోట్ల సోదాలు
డైరీలో బినామీ ఆస్తుల లెక్కలు గుర్తింపు
2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, రూ.8 కోట్ల విల్లా
కర్ణాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూమి
బెంగళూరు ఎయిర్‌పోర్టు వద్ద మరో ఎకరం
హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): పోలీసుశాఖలో అతి భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. పోలీసుశాఖలో సాధారణ కానిస్టేబుల్‌గా చేరి, రాతపరీక్షతో ఎస్సైగా ఎంపికై డీఎస్పీ స్థాయికి చేరిన ‘పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్’ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి సుమారు రూ.200 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. బినామీల పేరిట హైదరాబాద్ నగరం పరిధిలో, కర్ణాటకలో పెద్ద సంఖ్యలో ఆస్తులు కొనుగోలు చేసినట్టు తేల్చింది. ఈ మేరకు భీమ్‌రెడ్డిని అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు ఉన్నట్టు వచ్చిన సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు గురువారం హైదరాబాద్ గోల్కొండ ఇబ్రహీంబాగ్‌లోని భీమ్‌రెడ్డి నివాసం, ఆయన సొంతూరు మహబూబ్‌నగర్ జిల్లా ఆలూరులోని ఇల్లు, ఆయన బంధువులు, బినామీల నివాసాలు కలిపి 16 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. సుమారు రూ.8 కోట్ల విలువైన విల్లాలో నివసిస్తున్న భీమ్‌రెడ్డి నివాసంలో భారీగా ఆస్తుల పత్రాలు, విదేశీ మద్యం, రెండు కిలోల బంగారు ఆభరణాలను గుర్తించారు. అయితే ఆస్తుల్లో చాలా వరకు బినామీల పేరిట పెట్టిన భీమ్‌రెడ్డి.. ఎవరెవరి పేరిట, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ఒక చిన్న నోట్‌బుక్‌లో వివరంగా రాసిపెట్టుకున్నారు. ఆ నోట్‌బుక్ ఏసీబీ అధికారులకు దొరకడంతో.. దాని ఆధారంగా బినామీల ఇళ్లపైనా దాడులు చేసి, ఆస్తుల వివరాలను గుర్తించారు. భీమ్‌రెడ్డి బినామీగా ఉన్న మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి నివాసంలో చేసిన తనిఖీల్లో రూ.40 లక్షల నగదు, ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో విమానాశ్రయం సమీపంలో ఎకరం భూమి, అదే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మరో 44 ఎకరాల వ్యవసాయ భూమిని భీమ్‌రెడ్డి బినామీల పేరిట కొనుగోలు చేసినట్టు గుర్తించారు. అంతేకాదు ప్రభుత్వ అనుమతులు విదేశీ ప్రయాణాలు చేశారని, పదిసార్లు థాయ్‌లాండ్‌కు వెళ్లారని ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఇక ఇటీవల ప్రారంభమైన ఒక పార్టీ కార్యాలయ భవనం భీమ్‌రెడ్డికి సంబంధించినదేనని తెలిసింది.
ఏసీబీ గుర్తించిన ఆస్తుల వివరాలివీ..
హైదరాబాద్ ఇబ్రహీంబాగ్‌లోని వెస్సెల్లా మెడోస్‌లో విల్లా, గచ్చిబౌలి టెలికంనగర్‌లో జీప్లస్ 2 ఇల్లు, అదే ప్రాంతంలోని సాయిప్రభ రెసిడెన్సీలో ఒక ఫ్లాటు, గచ్చిబౌలిలోని క్రాంతి సియోన్ అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాట్, మణికొండ ల్యాంకో హిల్స్ రోడ్డులో జీప్లస్ 5 వాణిజ్య భవనంలో 500 చదరపు గజాల వాటా, మణికొండ మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో 3000 చదరపు అడుగుల వాణిజ్య స్థలం, తెల్లాపూర్ అభినందన రెసిడెన్సీలో రెండు ఫ్లాట్లు, ప్రగతి రిసార్ట్స్‌లో 500 చదరపు గజాల ప్లాట్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో 45 ఎకరాల భూములు, నాగోల్ కామినేని ఆస్పత్రి సమీపంలో 200 చదరపు గజాల ప్లాట్, పటాన్‌చెరు జీపీఆర్ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 గజాల ప్లాట్, మరోచోట 200 గజాల ప్లాట్, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 1000 చదరపు గజాల స్థలం, 2 ఎకరాల వ్యవసాయ భూమి, శ్రీరాఘవేంద్ర రాక్ శాండ్ మినరల్స్ సంస్థలో రూ.75లక్షల పెట్టుబడి, రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ గ్రామంలో 4.20 ఎకరాల వ్యవసాయ భూమిని ఏసీబీ అధికారులు గుర్తించారు. భీమ్‌రెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.3.6 లక్షల నగదు, రెండు కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, బ్యాంకు ఖాతాల్లో రూ.19.91 లక్షల బ్యాలెన్స్, చాలా ఖరీదైన 23 విదేశీ మద్యం బాటిళ్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. విచారణ ఇంకా కొనసాగుతోందని, పలుచోట్ల సోదాలు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ఆయనెవరికి బినామీ?
పోలీసుశాఖలో ఒక డీఎస్పీకి ఈ స్థాయిలో ఆస్తులు బయటపడటం చర్చనీయాంశంగా మారింది. నిజానికి గతంలో గ్యాంగ్‌స్టర్ నయీం కేసులోనూ భీమ్‌రెడ్డి పాత్రపై ఆరోపణలు ఉన్నాయి. అయితే భీమ్‌రెడ్డి బినామీల పేరిట బెంగళూరు విమానాశ్రయం సమీపంలో ఎకరం భూమి, కర్ణాటకలో మరో 44 ఎకరాల భూములు కొనడాన్ని గమనిస్తే... భీమ్‌రెడ్డి మరెవరికో బినామీగా ఉండవచ్చని ఏసీబీ అధికారులు అంతర్గత సంభాషణల్లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ చరిత్రలోనే ఇదో పెద్ద కేసు అని, ఇతర రాష్ట్రాల్లో ఈ స్థాయిలో ఆస్తులు కొన్న ప్రభుత్వ అధికారులెవరూ పట్టుబడలేదని అంటున్నారు.