Minister Bandi Sanjay: విద్యారంగ సమస్యలపై 75 ఏళ్లకు పైగా ఏబీవీపీ పోరాటం
ABN , Publish Date - Jan 06 , 2026 | 02:00 AM
విద్యారంగ సమస్యలపై 75 ఏళ్లకు పైగా అలుపెరగకుండా పోరాడుతున్న చరిత్ర అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
శంషాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): విద్యారంగ సమస్యలపై 75 ఏళ్లకు పైగా అలుపెరగకుండా పోరాడుతున్న చరిత్ర అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. దేశం కోసం.. ధర్మం కోసం ఏబీవీపీ కార్యకర్తలు ప్రాణత్యాగాలకైనా వెనుకాడకుండా పోరాడుతున్నారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జరుగుతున్న ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలు సోమవారం ముగిశాయి. ఈ ముగింపు ఉత్సవాలకు కేంద్ర మంత్రి హాజరై మాట్లాడారు. నాడు నక్సల్స్ చేతిలో ఎంతో మంది ఏబీవీపీ, పరివార్ క్షేత్ర కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో తెలంగాణ విద్యావ్యవస్థ ఛిన్నాభిన్నమైందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో 6 వేల పాఠశాలు మూసేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాదాపు 1,500 బడులు మూతపడ్డాయన్నారు. . ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థులను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్ర విద్యారంగ సమస్యలపై ఏబీవీపీ పోరాటాలు ఉధృతం చేయాలని సూచించారు. అంతకుముందు ‘జనమంచి గౌరీశంకర్ యువ పురస్కార్‘ను భీమనపల్లి శ్రీకాంత్‌కు ప్రదానం చేసి రూ.50 వేలను నగదు బహుమతిగా అందించారు.