Share News

23న పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:37 AM

రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాయని, వాటికి రాష్ట్ర ప్రభుత్వం కొమ్ముకాస్తోందని అఖిల భారత విద్యార్థి ..

23న పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

వడ్డెపల్లి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాయని, వాటికి రాష్ట్ర ప్రభుత్వం కొమ్ముకాస్తోందని అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) ఆరోపించింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు బంద్‌కు సంబంధించిన కరపత్రాలను హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అటకెక్కిందని, సీఎం రేవంత్‌రెడ్డి ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థల మాఫీయాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో 23 వేల ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేతకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల విచ్చలవిడి ఫీజు దోపిడీకి ప్రభుత్వం రెడ్‌కార్పెట్‌ పరిచిందన్నారు. ప్రభుత్వ స్కూళ్లు ప్రారంభమై నా.. ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫామ్స్‌ అందలేదని చెప్పారు.

Updated Date - Jun 20 , 2026 | 04:37 AM