ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు చేరువ చేయాలి
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:09 AM
భారత ప్రజాస్వామ్యం ప్రజలకు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెన ర్జీ అన్నారు.
వ్యవస్థలు సమస్యలు పరిష్కరించేలా ఉండాలి
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ
భవిష్యత్‌లో అన్నీ బయోలాజికల్ యుద్ధాలే
శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకుడు వరప్రసాద్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): భారత ప్రజాస్వామ్యం ప్రజలకు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెన ర్జీ అన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో భాగంగా ‘గ్రోత్, గవర్నెన్స్ అండ్ దపావర్టీ పజిల్’ అనే అంశంపై సోమవారం నిర్వహించిన చర్చలో ఆర్థికవేత్తలు కార్తీక్ మురళీధరన్, రతిన్ రాయ్‌లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ‘భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే, లోక్‌సభలో 540 సీట్లు మాత్రమే ఉన్నాయి. బ్రిటన్‌లో 6 కోట్ల మంది జనాభా ఉంటే.. 656 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. బ్రిటన్‌తో పోల్చుకుంటే మన దగ్గర 15 వేల మంది పార్లమెంట్ సభ్యులు ఉండాలి. అంతమందితో సభను నిర్వహించలేం. మరెలా అంటే రాష్ట్రాలకు తగిన అధికారాలివ్వాలి. ప్రజల సమస్యలను పరిష్కరించేలా వ్యవస్థలు ఉండాలి’ అని పేర్కొన్నారు. పాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని కార్తీక్ మురళీధరన్ తెలిపారు. చైనా విజయానికి వికేంద్రీకరణే కారణమని చెప్పారు. భవిష్యత్‌లో యుద్ధ విమానాలు, ఆయుధాలతో యుద్ధాలు జరగవని.. జరిగేవన్నీ బయాలాజికల్ యుద్ధాలేనని శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకుడు కె.ఐ. వరప్రసాద్ రెడ్డి అన్నారు. ‘వ్యాక్సిన్స్ అండ్ ద నేషన్’ అనే అంశంపై నిర్వహించిన చర్చలో ‘వ్యాక్సిన్ నేషన్: హౌ ఇమ్యునైజేషన్ షేప్డ్ ఇండియా’ పుస్తక రచయిత అమీర్ షాహుల్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరప్రసాద్‌రెడ్డిమాట్లాడుతూ.. మన రాజకీయ నాయకులలో చాలామందికి ఇప్పటికీ సైన్స్ పట్ల అవగాహన లేదని అన్నారు. విజ్ఞానవంతులతో కూడిన సమాజమే అత్యుత్తమ దేశాన్ని సృష్టించగలదని అభిప్రాయపడ్డారు.