రోడ్డు మీద ఖరీదైన హస్కీ జాతి కుక్కలు!
ABN , Publish Date - May 01 , 2026 | 05:55 AM
హస్కీ జాతి శునకాలు! నీలి కళ్లు... కాస్త నక్క, తోడేలు మాదిరి రూపం.. అయినా సాత్విక ప్రవర్తనతో డాగ్ లవర్స్‌ను ఆకట్టుకుంటాయి.
10 రోజుల క్రితం 30-40 దాకా కుక్కలను కంటెయినర్‌లో వదిలేసిన గుర్తుతెలియని వ్యక్తులు!
శంకర్‌పల్లి-పటాన్‌చెరు రోడ్డు సమీపంలో ఘటన
ఎండవేడిమికి తట్టుకోలేక పూర్తిగా నీరసించిన జీవాలు
ఒకటి మృతి.. కొన్నింటిని తీసుకెళ్లిన వాహనదారులు
ఇంకొన్ని అడవుల్లోకి.. 8 కుక్కలను రక్షించిన ఓ ఫౌండేషన్
మిగతా కుక్కలనూ కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడి
హైదరాబాద్ సిటీ, పటాన్‌చెరు, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): హస్కీ జాతి శునకాలు! నీలి కళ్లు... కాస్త నక్క, తోడేలు మాదిరి రూపం.. అయినా సాత్విక ప్రవర్తనతో డాగ్ లవర్స్‌ను ఆకట్టుకుంటాయి. ఓ సైబీరియన్ హస్కీ కుక్కపిల్ల ఖరీదు రూ.70వేలకు పైగానే ఉంటుంది. హైదరాబాద్‌లో క్రాస్‌బ్రీడ్ ఇండియన్ హస్కీలు ఎక్కువగా ఉన్నా.. వీటి ఖరీదూ భారీగా ఉంటుంది. డాగ్‌లవర్స్ ఎంతో ఇష్టపడే హస్కీ జాతి శునకాలను గుర్తుతెలియని వ్యక్తులు తెచ్చి రోడ్డు మీద వదిలేసిపోయారు. హైదరాబాద్ శివార్లలోని శంకర్‌పల్లి-పటాన్‌చెరు రోడ్డు సమీపంలో ఇటీవల ఈ ఘటన జరిగింది. ఏప్రిల్ 21న కొందరు వ్యక్తులు 30-40 దాకా కుక్కలను ఓ కంటెయినర్‌లో తెచ్చి అక్కడ వదిలేసినట్లు స్థానికులు చెప్పారు. అయితే వేడిని తట్టుకోలేని, చల్లదనాన్ని ఇష్టపడే ఈ శునకాలు మండే ఎండల్లో ఆహారం, సరైన నీరు లేక బాగా నీరసించిపోయాయి. ఓ శునకమైతే చనిపోయింది. ఇంకొన్ని కనిపించకుండాపోయాయి. ఇవన్నీ సైబీరియన్ హస్కీ జాతి కుక్కలేనని భావిస్తున్నారు. ఈ కుక్కలను ఎవరు, ఎందుకు వదిలివెళ్లారనేది ప్రశ్నార్థకంగా మారింది. కొందరు ఈ కుక్కలను గమనించినా, నక్కలుగా భావించి వాటి దగ్గరకు వెళ్లేందుకే భయపడ్డారు. ఈ కుక్కల్లో చాలావరకు రెండు నుంచి నాలుగేళ్ల వయసున్నవే ఉన్నాయి. ఇవి శిక్షణ పొందిన శునకాలు అయివుంటాయా? అని అనుమానిస్తున్నారు. జంతుపరిరక్షణ సంస్ధల సభ్యులు.
బ్రీడర్లు, రీసెర్చ్ ఆర్గనైజేషన్ సిబ్బంది తప్ప మిగిలిన వారి దగ్గర ఇంతపెద్ద సంఖ్యలో హస్కీ జాతి కుక్కలు ఉండవు అని.. మరి, జబ్బు పడటంతో వదిలేశారా? అక్రమ బ్రీడింగ్ సెంటర్లపై నిఘా పెరగడంతో భయపడి వదిలేశారా? పోషణను భారంగా భావించి వదిలేసి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల క్రితం సమీపంలోని ఓ దుకాణదారుడు, జంతు పరిరక్షణ సంస్ధ అయిన ఆసరా ఫౌండేషన్, ప్రతినిధులకు సమాచారమిచ్చాడు. ఆ సంస్థ సిబ్బంది అక్కడికి చేరుకునేసరికే చాలా కుక్కలు ఎండదెబ్బ నుంచి కాపాడుకోవడం కోసం సమీపంలోని అడవుల్లోకి వెళ్లిపోయాయి. కొన్నింటిని వాహనదారులు గుర్తించి.. తమ కార్లలో తీసుకెళ్లిపోయారు. తాము అక్కడికి చేరుకునేసరికే ఓ కుక్క చనిపోయిందని, బాగా నీరసించినస్థితిలో ఎనిమిది శునకాలు కనిపిస్తే వాటికి నీరు తాగించి రక్షించినట్లు సిబ్బంది చెప్పారు. ప్రస్తుతం అవి స్వాన్ ఎన్‌జీవో సంరక్షణలో ఉన్నాయి. సైబీరియన్ హస్కీ జాతి కుక్కలను గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ విజయకృష్ణ తెలిపారు.
..గుర్తిస్తే సమాచారం ఇవ్వండి
పూర్తిగా నీరసించిన స్థితిలో ఉన్న హస్కీ జాతి కుక్కలను చూసి గుండె తరుక్కుపోయింది. మా సంస్థ సిబ్బంది, స్వాన్ సంస్థ సభ్యులం కలిసి రెండు అంబులెన్స్‌ల్లో వెళ్లి ఓ ఎనిమిది డాగ్స్‌ను కాపాడాం. మిగిలిన వాటి కోసం మా వలంటీర్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్వేషిస్తున్నారు. అవి ఏ స్థితిలో ఉన్నాయో తెలీదు. ఎవరైనా వీటిని గుర్తిస్తే 9949872527 ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. కాపాడే ప్రయత్నం చేస్తాం. మిగతాచోట్ల కూడా ఎక్కడైనా దీనస్థితిలో శునకాలు కనిపిస్తే చెప్పండి.
-వందన గౌరి, ఆసరా ఫౌండేషన్