Aarogyasri Support: ఆరోగ్యశ్రీ కింద అశ్విన్‌కు క్యాన్సర్ చికిత్స
ABN , Publish Date - Jan 01 , 2026 | 08:14 AM
బుడి బుడి అడుగుల బుడ్డోడికి పెద్ద కష్టం శీర్షికన ఈ నెల 28 ‘ఆంధ్రజ్యోతి దినపత్రిక’లో ప్రచురించిన కథనంపై రాజీవ్ ఆరోగ్య శ్రీ అధికారులు స్పందించారు.
హుస్నాబాద్‌కు చెందిన రెండేళ్ల బాలుడు ఆశ్విన్‌కు క్యాన్సర్
ఆంధ్రజ్యోతిలో కథనం.. స్పందించిన ఆరోగ్యశ్రీ అధికారులు
హుస్నాబాద్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ‘బుడి బుడి అడుగుల బుడ్డోడికి పెద్ద కష్టం’ శీర్షికన ఈ నెల 28 ‘ఆంధ్రజ్యోతి దినపత్రిక’లో ప్రచురించిన కథనంపై రాజీవ్ ఆరోగ్య శ్రీ అధికారులు స్పందించారు. క్యాన్సర్ బారిన పడిన బాలుడిని ఆరోగ్య శ్రీ పథకం కింద హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గోప్యాతండాకు చెందిన లావుడ్య భూపాల్, కళావతి దంపతుల రెండేళ్ల కుమారుడు అశ్విన్‌కు క్యాన్సర్ సోకింది. చికిత్సకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు నిస్సహాయతతో కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించగా రాజీవ్ ఆరోగ్య శ్రీ సిద్దిపేట జిల్లా మేనేజర్ విజయ్ భాస్కర్, టీమ్ లీడర్ నవీన్‌కుమార్, ఆరోగ్య మిత్ర రమేశ్‌లు స్పందించి బాలుడిని లక్డీకాపూల్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రికి తరలించారు. అశ్విన్ ప్రస్తుతం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడని, పూర్తి చికిత్స ఆరోగ్య శ్రీ కింద చేయిస్తామని ఆరోగ్య శ్రీ అధికారులు తెలిపారు. దీనిపై లావుడ్య భూపాల్ ‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు తెలిపారు.