kumaram bheem asifabad- ‘ఆధార్’ సవరింపులు ఇక ఈజీ
ABN , Publish Date - Oct 14 , 2026 | 10:26 PM
ఆధార్ కార్డుల్లో పేరు, ఇంటిపేరు, చిరునామాల్లో స్పెల్లింగ్, భాషాపరమైన తప్పులకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ-ఉడాయ్) పరిష్కారాన్ని తీసుకొచ్చింది. పేరు మార్చుకోవడంతో పాటు తప్పులను సవరించుకునేందుకు ఉడాయ్ నూతన నిబంధనలను అందు బాటులోకి తీసుకవచ్చింది.
- సంబంధిత డాక్యుమెంట్లతో రూ.75 చెల్లిస్తే చాలు
బెజ్జూరు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆధార్ కార్డుల్లో పేరు, ఇంటిపేరు, చిరునామాల్లో స్పెల్లింగ్, భాషాపరమైన తప్పులకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ-ఉడాయ్) పరిష్కారాన్ని తీసుకొచ్చింది. పేరు మార్చుకోవడంతో పాటు తప్పులను సవరించుకునేందుకు ఉడాయ్ నూతన నిబంధనలను అందు బాటులోకి తీసుకవచ్చింది. ఆధార్‌లో పేరు, ఇంటిపేరు, చిరునామాలోని తప్పుల ను సరి చేయడం ఇప్పుడు చాలా తేలిక. అలాగే వివాహం, విడాకుల అనంతరం మహిళలు తమ ఇంటి పేరును సులువుగా మార్చుకునే వెసులుబా టును కూడా ఉడాయ్ కల్పించింది. అంతేకాదు ఆధార్‌లో కింతమంది అలియాస్ పేరుతో రెండు పేర్లు ఉన్నవారు కూడా ఇప్పుడు తాము శాశ్వతంగా వినియోగించుకునే ఒక పేరునే ఆధార్‌లో పెట్టుకునే అవకాశాన్ని కల్పించింది. పేరు, ఇంటి పేరు, చిరునామాలో ఎలాంటి తప్పులున్నా ఉడాయ్ జారీ చేసిన నిర్దేశిత డాక్యుమెంట్లతో ఆధార్ కేంద్రానికి వెళ్లి రూ.75చెల్లించి తేలికగా మార్చుకోవచ్చు. అయితే పేరు పూర్తిగా మార్చుకోవాలంటే మాత్రం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ తప్పనిసరి.
- చిన్నపాటి సవరణలు..
పేరు, ఇంటి పేరు, చిరునామాలో చిన్నపాటి సవర ణలను మైనర్ కరెక్షన్ కేటగిరీలో సరిచేసుకోవచ్చు. పొట్టిగా ఉన్న పేర్లను కుదించడం, పూర్తిగా మార్చడం, ఇంటి పేరు తొలగించడం, జోడించడం, పేర్ల క్రమాన్ని మార్చుకోవడం, ఉచ్చారణ పరంగా ఒకేలా ఉండే అక్షర దోషాలను ఈ కేటగిరీలో సరిచేసుకోవచ్చు. అయితే వీటికి సంబంధిత ఏదైనా డాక్యుమెంట్ సమర్పిస్తే సరిపోతుంది. ఉదాహరణకు కుబీ రాజును కొండవీటి భాస్కర్ రాజుగా మార్చుకో వచ్చు. ఇందుకు ఏదైనా గుర్తింపు పత్రం ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు.
- వివాహం/విడాకుల సందర్భాల్లో..
మహిళలకు సంబంధించిన ఇంటిపూరు మార్పు లు, వివాహం, విడాకుల సందర్భాల్లో అవసరం పడుతుంది. ఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రంతో పాటుగా అవసరమైన అఫిడవిట్(అనెక్షర్ డీ) సమర్పించాల్సి ఉంటుంది. బాల ఆధార్‌లోని బూబీ ఆఫ్ స్థానంలో పిల్లల పేరు నమోదు చేసేందుకు ఐడెంటిటీ ప్రూఫ్, రిలేషన్షిప్ ప్రూఫ్ సమర్పించాలి. అలాగే ఉరఫ్/అలియాస్ తొలగించుకు నేందుకు మేజర్లయితే సంబంధిత గుర్తింపుతో పాటు ఐడెంటిటీ ప్రూఫ్, అనెక్షర్ ఈ అఫిడవిట్ సమర్పించాలి. అలాగే మైనర్లు అయితే సంబంధిత గుర్తింపు పత్రంతో పాటుగా ఐడెంటిటీ ప్రూఫ్, రిలేషన్‌షిప్‌తో పాటుగా అనెక్షర్ ఎఫ్ అఫిడవిట్ సమర్పించాలి.
- వివరాలు నమోదు లోపాలు..
ఆధార్ నమోదు సందర్భంలో సరైన పత్రాలు ఇచ్చినప్పటికీ వివరాలు నమోదు చేసేటప్పుడు అక్షర దోషాల కారణంగా ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా పడితే సవరించుకోవచ్చు. ఇందుకు పెద్దలు సంబంధిత అఫిడవిట్ (అనెక్షర్ బీ)తో పాటు ఐడెంటిటీ ప్రూఫ్, రిలేషన్షిప్ ప్రూఫ్ సమర్పించాలి. మైనర్ల డేటా తప్పుల సవరణకు ప్రత్యేకమైన మైనర్ అఫిడవిట్(అనెక్షర్ సీ) సమర్పించాలి. కాగా ఆధార్‌లో పేరు, చిరునామా వివరాలు ఇంగ్లీష్‌తో పాటుగా తెలుగులో కూడా ఉంటాయి. అయితే ఇంగ్లీష్‌లో పేరు సరిగ్గా ఉండి తెలుగులో తప్పుగా ఉంటే సంబంధిత గుర్తింపు పత్రం, అఫిడవిట్ సమర్పించితే సవరించుతారు.
- పేరు మార్పునకు గెజిట్..
ఆధార్‌లోని వ్యక్తి పేరును పూర్తిగా మార్చాలంటే మాత్రం తప్పనిసరిగా పేరు మార్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ కావాలి. ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ సమర్పించిన వారికే గెజిట్‌లో ఉన్నట్లుగా పేరు మారుస్తారు. అయితే పేరు మార్పు అనేది ఒకసారి మాత్రమే. ఆధార్‌లోని పేరు, ఇంటిపేరు, చిరునామా వివరాలు, స్పెల్లింగ్, భాసాపరమైన తప్పు లు, ఇంటిపేరు మార్పులతో పాటుగా పేరు మార్పు లు చేసుకోవాలంటే సంబంధిత డాక్యుమెంట్లు, అఫిడవిట్లతో ఆధార్ సేవా కేంద్రానికి స్వయంగా వెళ్లాలి. అలాగే ఈ వివరాలు అప్డేట్ చేసుకునేం దుకు బయోమెట్రిక్ అథంటిఫికేషన్ పూర్తి చేశాక సంబంధిత డాక్యుమెంట్లు, అఫిడవిట్లు సమర్పించి రూ.75చెల్లిస్తే సవరణ చేస్తారు. ఆధార్ సేవా కేంద్రంలో సవరణలు చేశాక వారం నుంచి నెల రోజు ల లోపు మొబైల్‌కు అప్డేట్ చేసినట్లుగా మెసేజ్ వస్తుంది. అలాగే తప్పులు, పొరపాట్లు సవరణ చేసిన ఆధార్ కార్డు ఇంటికి పోస్టులో వస్తుంది.