Share News

ఆధార్‌ తిప్పలు తీరేలా.. సేవా కేంద్రాల పెంపు!

ABN , Publish Date - May 22 , 2026 | 03:59 AM

ఆధార్‌ పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులు త్వరలోనే తీరనున్నాయి. హైదరాబాద్‌ రీజినల్‌ సెంటర్‌ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలతోపాటు ...

ఆధార్‌ తిప్పలు తీరేలా.. సేవా కేంద్రాల పెంపు!

  • తెలంగాణలో 9, ఏపీలో 14 కొత్త కేంద్రాలు

  • సెప్టెంబరు 15 లోగా అందుబాటులోకి..

హైదరాబాద్‌ సిటీ, మే 21 (ఆంధ్రజ్యోతి): ఆధార్‌ పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులు త్వరలోనే తీరనున్నాయి. హైదరాబాద్‌ రీజినల్‌ సెంటర్‌ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఆధార్‌ సేవా కేంద్రాలను పెంచుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆరు ఆధార్‌ సేవ కేంద్రాలుండగా.. త్వరలోనే తెలంగాణలో 9, ఆంధ్రప్రదేశ్‌లో 14 కేంద్రాలను అందుబాటులోకి తేనున్నారు. తెలంగాణలో మహబూబ్‌నగర్‌, మల్కాజిగిరి, సంగారెడ్డి, మిర్యాలగూడ, నల్లగొండ, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, మంచిర్యాలలో ఏర్పాటు చేయనుండగా.. ఏపీలో అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి, మచిలీపట్నం, ఏలూరు, భీమవరం, అరకులోని పాడేరు, శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, పల్నాడు, గుంటూరులో అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్‌ 15వ తేదీలోపు వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కేంద్రాల్లో ఆపరేటర్లు చేస్తున్న తప్పులతో సామాన్యులు హైదరాబాద్‌లోని ఆధార్‌ రీజినల్‌ సెంటర్‌కు పరుగులు తీయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ చేసే కేంద్రాల్లో ఆపరేటర్ల తప్పిదాలపై నిఘా పెట్టామని హైదరాబాద్‌ ఆధార్‌ రీజినల్‌ ఆఫీసు ఉన్నతాధికారులు తెలిపారు.

లొంగిపోయిన నక్సల్స్‌ కోసం స్పెషల్‌ డ్రైవ్‌..

ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో లొంగిపోయిన మావోయిస్టులకు ఆధార్‌ కార్డులను జారీ చేసేందుకు హైదరాబాద్‌ రీజినల్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. వారి వద్ద ఎలాంటి అడ్రస్‌ ప్రూఫ్‌లు లేకపోవడంతో పోలీసు ఉన్నతాధికారులు అందించే జాబితా, అడ్రస్‌ ఆధారంగానే ఆధార్‌ కార్డులను జారీ చేశారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లకు సంబంధించి ఇప్పటివరకు వెయ్యి మంది వరకు ఆధార్‌ కార్డులను జారీ చేసినట్లు తెలిసింది. ఆధార్‌ కార్డు ద్వారానే ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు మాజీ మావోయిస్టులకు అందనున్నాయి. ఇటు జైళ్లలో ఖైదీలకు, అనాథ శరణాలయాల్లోని అనాథలకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి ఆధార్‌ కార్డులను జారీ చేస్తామని హైదరాబాద్‌ రీజినల్‌ సెంటర్‌ నిర్వాహకులు తెలిపారు.

Updated Date - May 22 , 2026 | 03:59 AM