కోటి మంది బడి పిల్లల ఆధార్ నవీకరణ పూర్తి
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:52 AM
దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల ఆధార్ వివరాల అప్‌డేట్ కీలక మైలురాయికి చేరుకుంది. ఆధార్ నిర్వహణ సంస్థ యూఐడీఏఐ, 83వేల పాఠశాలల్లోని కోటి మంది పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తి చేసినట్లు అధికారికంగా ...
దేశవ్యాప్తంగా 83వేల స్కూళ్లలో ప్రత్యేక బయోమెట్రిక్ క్యాంపులు
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల ఆధార్ వివరాల అప్‌డేట్ కీలక మైలురాయికి చేరుకుంది. ఆధార్ నిర్వహణ సంస్థ యూఐడీఏఐ, 83వేల పాఠశాలల్లోని కోటి మంది పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. సాఽధారణంగా ఐదేళ్లలోపు వయసున్న పిల్లలకు ఆధార్ నమోదు సమయంలో వారి ఫొటో, పేరు, పుట్టిన తేదీ, లింగం, అడ్ర్‌సను రికార్డు చేస్తారు. ఆ వయస్సులో వేలిముద్రలు, కంటి పాపలోని గుర్తులు పూర్తిగా అభివృద్ధి చెందని కారణంగా అవి తీసుకోరు. పిల్లలు ఐదేళ్ల వయసు దాటాక, ఆ తర్వాత 15 ఏళ్లు పూర్తయ్యాక తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తిచేయకపోతే ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాల లబ్ధి పరంగా.. నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు, యూనివర్సిటీ ప్రవేశాల సమయంలో ఆధార్ ధ్రువీకరణ పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ సమస్యను దృష్టిలో పె ట్టుకుని యూఐడీఏఐ ప్రత్యేకంగా పాఠశాల విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2025 అక్టోబరు 1 నుంచి, 7-15 ఏళ్ల వయస్సు గల పిల్లలకు ఒక సంవత్సరం పాటు బయోమెట్రిక్ అప్‌డేట్స్‌ను సంస్థ పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. విద్యాశాఖకు చెందిన పలు వ్యవస్థలతో సాంకేతిక సమన్వయం సాధించడం ద్వారా పాఠశాలల వద్దే పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్స్ స్థితిని గుర్తించి, అవసరమైన చోట ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది. కాగా ఈ కార్యక్రమానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారం మరింత అవసరమని యూఐడీఏఐ భావిస్తోంది. అందుకే సంస్థ సీఈవో భువనేశ్‌కుమార్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసి, పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ అప్డేట్ క్యాంపులు నిర్వహించేందుకు మద్దతివ్వాలని కోరినట్లు సమాచారం. దేశంలోని అన్ని పాఠశాలలు కవర్‌య్యే వరకు ఈ ప్రచారం కొనసాగించాలని యూఐడీఏఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పాఠశాలల్లో నిర్వహించిన క్యాంపులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ నమోదు కేంద్రాలు, మీసేవా కేంద్రాల్లో కూడా పిల్లలు తమ బయోమెట్రిక్ అప్‌డేట్స్ పూర్తి చేసుకోవచ్చు. ఇదే కాలంలో ఈ కేంద్రాల ద్వారా కూడా సుమారు 1.3 కోట్ల బయోమెట్రిక్ అప్‌డేట్‌ల ప్రక్రియలు పూర్తయిందని యూఐడీఏఐ వెల్లడించింది. ఈ విధంగా తక్కువ సమయంలోనే పాఠశాలల భాగస్వామ్యంతో ఒక కోటి మంది పిల్లలు లబ్ధి పొందగా మరెంతో మంది విద్యార్థులు త్వరలోనే దీనివల్ల ప్రయోజనం పొందనున్నారని అధికారులు భావిస్తున్నారు.