kumaram bheem asifabad-ఆదాయ వనరు..ఆయిల్‌పామ్ సాగు
ABN , Publish Date - Sep 22 , 2026 | 10:47 PM
సంప్రదాయ పంటల సాగు రోజురోజుకు భారంగా మారుతోంది. పెట్టుబడులు పెరగడం, దిగుబడులు తగ్గుతుండటంతో ఏటా రైతులు సాగులో నష్టాలను చవిచూస్తున్నారు. దీంతో రైతులు ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
- యేటా పెరుగుతున్న ధర
- ఆసక్తి చూపుతున్న రైతులు
- సాగుకు ప్రభుత్వ సబ్సిడీలు
- 30ఏళ్ల వరకు దిగుబడి
బెజ్జూరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సంప్రదాయ పంటల సాగు రోజురోజుకు భారంగా మారుతోంది. పెట్టుబడులు పెరగడం, దిగుబడులు తగ్గుతుండటంతో ఏటా రైతులు సాగులో నష్టాలను చవిచూస్తున్నారు. దీంతో రైతులు ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. దీర్ఘకాలంగా దిగుబడులు ఇచ్చే ఆయిల్‌పామ్ సాగు చేయాలని ప్రభుత్వమూ ప్రోత్సహిస్తోంది. దీనిపై రైతులకు ఉద్యాన శాఖ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం అందించే రాయితీలను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిర్పూర్(టి) నియోజకవర్గంలో ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు ఔత్సాహికులైన రైతులు ముందుకు వస్తున్నారు. దీంతో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది.
మొదటి మూడేళ్లలో..
ఆయిల్‌పామ్ తోటలో మొదటి మూడేళ్లలో అంతర పంటలు వేసుకునేందుకు అవకాశం ఉంది. వీటితో కొంత ఆదాయాన్ని పొందవచ్చు. యాజమాన్య పద్దతులు సక్రమంగా పాటిస్తే 3వ ఏడాది నుంచి 30ఏళ్ల వరకు ఆయిల్‌పామ్ దిగుబడి లభిస్తుంది. సిర్పూర్ తాలుకా పరిదిలోని 7మండలాల్లో 1231ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశారు. దహెగాంలో 528ఎకరాలు, పెంచికలపేటలో 197ఎకరాలు, చింతలమానేపల్లిలో 54ఎకరా లు, కాగజ్‌నగర్‌లో 332ఎకరాలు, సిర్పూర్(టి)లో 64ఎకరాలు, బెజ్జూరులో 26ఎకరాలు, కౌటాలలో 30ఎకరాల్లో సాగు చేశారు. కాగా ఆయిల్‌పామ్ సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రాయితీలు అందిస్తున్నాయి. మొక్కల పెంపకం, డ్రిప్ ఇరిగేషన్ పరిక రాలను సన్న చిన్నకారు రైతుల్లో ఎస్సీ, ఎస్టీలకు 90శాతం, బీసీలకు 80శాతం, ఇతరులకు 70శాతం సబ్సిడీతో ఉద్యానవన శాఖ అందిస్తోంది. ఎకరానికి రూ.15వేల చొప్పున ప్రోత్సాహకంగా అందిస్తోంది. 365రోజులు నీటి లభ్యత గల రైతులను రాయితీతో ప్రోత్సహిస్తోంది. రైతులకు ఎకరాకు రూ.4200చొప్పున నాలుగేళ్ల పాటు ఇస్తోంది. ఆయిల్‌పామ్ ఒక మొక్క ధర రూ.193ఉండగా, రైతు కేవలం రూ.20చెల్లిస్తే సరిపోతుంది. మిగితా వాటా కూడా ప్రభుత్వమే నేరుగా రైతులకు అందజేస్తోంది.
రైతులకు లాభదాయకం...
- సుప్రజ, కాగజ్‌నగర్ డివిజన్ ఉద్యానవన అధికారి
ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు తక్కువ పెట్టుబడితో మంచి లాభాన్ని పొందవచ్చు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నియోజకవర్గంలో ఏటేటా సాగు పెరుగు తోంది. ప్రభుత్వం అందించే రాయితీలు పొంది ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ముందుకు వస్తే ప్రోత్సహిస్తాం.