kumaram bheem asifabad-దైన్యం.. పశువైద్యం
ABN , Publish Date - Jul 02 , 2026 | 10:56 PM
జిల్లాలో పశు వైద్యం అందని ద్రాక్షగా మారింది. ముఖ్యంగా పశు వైద్య సిబ్బంది కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు పశువైద్యశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లాలో వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమతో రైతులు జీవనోపాధి పొందుతున్నారు. రైతుల సౌకర్యార్థం పశుసంవర్థకశాఖ సౌకర్యాలను మెరుగుపర్చాల్సి ఉంది.
వానాకాలంలో పొంచి ఉన్న వ్యాధుల ముప్పు
బెజ్జూరు, జూలై 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పశు వైద్యం అందని ద్రాక్షగా మారింది. ముఖ్యంగా పశు వైద్య సిబ్బంది కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు పశువైద్యశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లాలో వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమతో రైతులు జీవనోపాధి పొందుతున్నారు. రైతుల సౌకర్యార్థం పశుసంవర్థకశాఖ సౌకర్యాలను మెరుగుపర్చాల్సి ఉంది. కానీ ఆ దిశగా చర్యలు లేవు. పశువైద్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది కొరతతో జీవాలకు వైద్యం అందక పాడి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో కొన్ని పశు వైద్య కేంద్రాలు శిథిలావస్థకు చేరాయి. పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో ఆయా కేంద్రాల్లో సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించడం లేదన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. కాగా వానాకాలంలో పశువులు గాలికుంటు, గొంతువాపు, జబ్బవాపు, కిటుకురోగం బారిన పడ తాయి. వీటి కారణంగా గొర్రె లు, మేకలు ఎక్కువగా మృత్యువాత పడతాయి. ఈ సమయంలో వైద్యసిబ్బంది అందుబాటులో ఉండి సకాలంలో చికిత్స అందిస్తే పరిస్థితి అదుపులో ఉంటుంది. అయితే పశుసంవర్దకశాఖలో వైద్యసిబ్బంది ఖాళీలు అధికంగా ఉన్నాయి. కొన్ని కేంద్రాలకు పూర్తిస్థాయి వైద్యులు లేకపోవడంతో గోపాలమిత్రలే కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా కేంద్రాల్లో రెగ్యూలర్ వైద్యులు లేని కారణంగా ప్రైవేటుకు తీసుకెళ్లి చికిత్స చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇలా..
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 19పశువైద్య కేంద్రాలు ఉన్నాయి. ఇందులో కేవలం 13మంది వైద్యులు మాత్రమే పని చేస్తున్నారు. ఆందులోనూ ఇద్దరు కాంట్రాక్టు వైద్యులు, ఇద్దరు అవుట్ సోర్సింగ్ పద్ధతిన పని చేస్తున్నారు. పూర్తిస్థాయిలో వైద్యులు లేని చోట్ల సమీప మండలానికి చెందిన అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో వైద్యులు లేనిచోట్ల పశుపోషకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం పశువైద్యులను నియమించడంపై దృష్టి సారించాలని పశుపోషకులు కోరుతున్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం..
- డాక్టర్ సురేష్, జిల్లా పశువైద్యాధికారి
జిల్లాలో కొన్ని ఖాళీలు ఉన్నమాట వాస్తవమే. అయినా జీవాలకు వైద్యసేవలు సక్రమంగానే అందుతున్నాయి. అవసరమైతే గోపాలమిత్రల సేవలను వినియోగించుకుం టున్నాం. ఔషధాల కొరత లేదు. బెజ్జూరు, రెబ్బెన లాంటి కేంద్రాలకు శిథిలావస్థకు చేరాయి. ఖాళీల వివరాలు, భవనాల స్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. పోస్టుల నియామకం విషయం ప్రభుత్వ పరిధిలో ఉంటుంది.