Share News

క్యాన్సర్‌ ఆస్పత్రులను విస్తరిస్తాం

ABN , Publish Date - May 16 , 2026 | 04:52 AM

రాష్ట్రంలో క్యాన్సర్‌ బాధితులు అధికంగా ఉన్న చోటల్లా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. క్యాన్సర్‌ చికిత్సను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా .....

క్యాన్సర్‌ ఆస్పత్రులను విస్తరిస్తాం

  • రాష్ట్రంలో క్యాన్సర్‌ బాధితులు అధికంగా ఉన్న చోటల్లా ఆస్పత్రులు: సీఎం రేవంత్‌

  • సీఎంను కలిసిన నోరి దత్తాత్రేయుడు

  • ‘క్యాన్సర్‌ అట్లాస్‌ ఆఫ్‌ తెలంగాణ’ అందజేత

హైదరాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్యాన్సర్‌ బాధితులు అధికంగా ఉన్న చోటల్లా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. క్యాన్సర్‌ చికిత్సను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ఇతర చోట్లకు విస్తరిస్తామన్నారు. శుక్రవారం ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి ‘క్యాన్సర్‌ అట్లాస్‌ ఆఫ్‌ తెలంగాణ’ను అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో క్యాన్సర్‌ వ్యాధిపై సమగ్ర నివేదిక అందజేసిన నోరి దత్తాత్రేయుడిని సీఎం అభినందించారు. క్యాన్సర్‌పై పోరాటంలో ప్రభుత్వానికి ఈ అట్లాస్‌ ఉపకరిస్తుందన్నారు. ఈ నివేదిక ఆధారంగా క్యాన్సర్‌ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, దాని విస్తరణకు కారణాలను అన్వేషించే అవకాశం లభిస్తుందని చెప్పారు. నివేదికలో అందించిన డేటా ఆధారంగా క్యాన్సర్‌ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక స్ర్కీనింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో క్యాన్సర్‌ చికిత్సను మరింత సమర్థంగా అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, సీఎంవో ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టియానా జెడ్‌ చోంగ్తూ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2026 | 04:52 AM