Share News

మెడికోల ఆత్మహత్యలపై..ప్రతీ నెల నివేదికివ్వాల్సిందే

ABN , Publish Date - Aug 27 , 2026 | 06:30 AM

దేశంలో వైద్య విద్యార్థుల మానసిక ఒత్తిడి, ఆత్మహత్యల ఘటనలపై జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తీవ్రస్థాయిలో స్పందించింది.

మెడికోల ఆత్మహత్యలపై..ప్రతీ నెల నివేదికివ్వాల్సిందే

  • సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు..మెడికల్‌ కాలేజీలకు ఎన్‌ఎంసీ ఆదేశాలు

హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): దేశంలో వైద్య విద్యార్థుల మానసిక ఒత్తిడి, ఆత్మహత్యల ఘటనలపై జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తీవ్రస్థాయిలో స్పందించింది. మెడికల్‌ కాలేజీల్లో చోటుచేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలపై ప్రతీ నెల సమగ్ర నివేదిక సమర్పించాలని దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలను ఆదేశించింది. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భద్రతపై సుప్రీంకోర్టు జారీ చేసిన స్పష్టమైన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్‌ఎమ్‌సీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించాలని కాలేజీ యాజమాన్యాలకు స్పష్టం చేసింది. వైద్య విద్యార్థుల ఆత్మహత్యలు లేదా సహజేతర మరణాలకు సంబంధించిన ప్రతి ఘటనను నమోదు చేసి, సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఇటువంటి ఘటనలపై వార్షిక నివేదికను యూజీసీ, ఇతర నియంత్రణ సంస్థలకు కూడా సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. విద్యార్థుల పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లను నాలుగు నెలల్లో అందించాలని స్పష్టం చేసింది. కాగా వైద్య కళాశాలలు, వైద్య విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర, కీలక పరిపాలనా పోస్టులను నాలుగు నెలల్లోగా భర్తీ చేయాలని ఎన్‌ఎంసీ ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో భాగంగా ఎన్‌ఎంసీ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు తాజాగా పబ్లిక్‌ నోటీసు జారీ చేసింది. ఈ అంశాన్ని అత్యంత అత్యవసరంగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. డీన్‌/డైరెక్టర్‌/ప్రిన్సిపాల్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, వైస్‌ చాన్సలర్‌, రిజిస్ట్రార్‌ వంటి కీలక పదవుల ఖాళీలు, వాటి భర్తీకి చేపట్టిన చర్యలను కూడా నివేదించాలని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.


సెప్టెంబరు 1లోగా అఫిడవిట్‌

సుప్రీంకోర్టు 2026 జనవరి 15, జూలై 30 తేదీల్లో ఇచ్చిన ఆదేశాల అమలుకు సంబంధించి అఫిడవిట్‌ను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సెప్టెంబరు 1 లోగా దాఖలు చేయాల్సి ఉందని ఎన్‌ఎంసీ తెలిపింది. సంబంధిత వైద్య విద్యా సంస్థల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి, ధ్రువీకరించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. క్యాంప్‌సలలో ప్రొఫెసర్లు పాఠాలు చెప్పడానికే పరిమితం కాకుండా, విద్యార్థుల ప్రవర్తనను గమనించే ‘గేట్‌కీపర్లు’గా వ్యవహరించాలని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బిహేవియర్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ సూచించినట్లు ఎన్‌ఎంసీ గుర్తుచేసింది. విద్యార్థుల హాజరు శాతంలో మార్పులు, ఒంటరిగా ఉండటం వంటి మార్పులను గమనించి, వారిని ఆప్యాయంగా పలకరించాలని పేర్కొంది.

Updated Date - Aug 27 , 2026 | 06:50 AM