Share News

అలుగునూర్‌ గడ్డపై గులాబీ గర్జన

ABN , Publish Date - Nov 30 , 2026 | 01:10 AM

అలుగునూర్‌ గడ్డపై గులాబీ జెండాలు రెపరెపలాడాయి. నాటి దీక్షా దివస్‌ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుకు చేసుకునేలా దండులా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో ఆ ప్రాంగణమంతా జనసంద్రంగా మారింది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తండోపతండాలుగా తరలివచ్చిన

అలుగునూర్‌ గడ్డపై గులాబీ గర్జన

కరీంనగర్‌/ కరీంనగర్‌ టౌన్‌/ మానకొండూర్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): అలుగునూర్‌ గడ్డపై గులాబీ జెండాలు రెపరెపలాడాయి. నాటి దీక్షా దివస్‌ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుకు చేసుకునేలా దండులా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో ఆ ప్రాంగణమంతా జనసంద్రంగా మారింది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తండోపతండాలుగా తరలివచ్చిన జనాలతో దీక్షా దివస్‌ సభా స్థలి నిండిపోయింది. జై తెలంగాణ.. జై కేసీఆర్‌ నినాదాలు మార్మోగాయి. కేసీఆర్‌ను అరెస్ట్‌ చేసిన ఘటనను గుర్తు చేసుకున్న ఉద్యమకారులు, నాయకులు జ్ఞాపకాలు సజీవమయ్యాయి. ఎటు చూసినా జనాలతో సరికొత్త సందడి కనిపించింది. అడుగుడుగనా కార్యకర్తల కోలాహలం.. గులాబీ పార్టీ గుబాళింపుతో ఉద్యమాల గడ్డ అలుగునూర్‌ పులకించింది, అమరుల త్యాగాలు, పోరాటల స్ఫూర్తి సభా వేదికపై ప్రతిధ్వనించింది. దీక్షా దివస్‌ వేదికగా తెలంగాణ ఆకాంక్షలు మళ్లీ నెరవేర్చుకుంటామనే శ్రేణుల ఉత్సాహాలు కదం తొక్కాయి. ఉత్తేజభరితంగా కేటీఆర్‌ మాట్లాడిన ఈ వేడుక బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది.

ఫ చరిత్రను మలుపు తిప్పిన రోజు..

ఇదే అలుగునూర్‌ గడ్డ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందని.. రాష్ట్ర కలను సాకారం చేసిన నేలగా ఇది గుర్తుండి పోతుందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అనడంతో సభికుల నుంచి కరతాళధ్వనుల మోత వినిపించింది. చరిత్రను మలుపు తిప్పిన రోజుగా నవంబరు 29 యుగయుగాలకు గుర్తుండిపోతుందని, ఇక్కడి నేల మట్టిని నుదుట బొట్టుగా పెట్టుకుని కేసీఆర్‌ తీగలగుట్టపల్లి నుంచి అలుగునూర్‌ బయలుదేరారన్నారు. కరీంనగర్‌ మామూలు జిల్లా కాదని.. సింహగర్జన చేసిన కొదుమ సింహాల జిల్లా అని కొనియాడారు. ఉద్యమానికి ఊపిరిలూదిన జిల్లాగా అభివర్ణించారు. అరెస్ట్‌కు ముందు రోజున తీగలగుట్టపల్లిలో అయ్యప్ప పూజ వద్ద ఉన్న తమకు కేసీఆర్‌ను అరెస్ట్‌ చేస్తారనే వార్త తెలిసి అప్రమత్తమయ్యామన్నారు. వెయ్యి మంది వరకు రక్షణగా నిలబడ్డామన్నారు. జక్కుల నాగరాజు, ఏనుగు రవీందర్‌రెడ్డి, పొన్నం అనిల్‌కుమార్‌లాంటి యువకులు పెట్రోల్‌ డబ్బాలు పట్టుకుని ఆందోళనకు సిద్ధమైన విషయాన్ని నెమరువేసుకున్నారు. వందల కార్లతో ముందుకెళ్తుంటే కేసీఆర్‌ను అలుగునూర్‌ వద్ద అరెస్ట్‌ చేస్తే ఆయన సత్యాగ్రహ దీక్ష చేపట్టి రాష్ర్టాన్ని సాధించారన్నారు. జయశంకర్‌ సారుతో కలిసి తాను వరంగల్‌ మార్గంలో వెళ్లిన విషయాన్ని సభలో కేటీఆర్‌ ప్రస్తావించారు. బీజేపీ వాళ్లు ఒక బడి, ఒక గుడి కూడా తేలేదని విమర్శించారు. మనోహరాబాద్‌- కొత్తపల్లి రైలు మార్గాన్ని రెండు దశాబ్దాలైనా పూర్తి చేయలేదని విమర్శించారు.

ఫ బీఆర్‌ఎస్‌కు ప్రజల మద్దతు ఉంది..

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కేసీఆర్‌కు ముందు కేసీఆర్‌కు తర్వాత అనే విధంగా ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రజల మద్దతు ఉందన్నారు. జేబులో మరణ వాంగ్మూలాన్ని పెట్టుకుని ఇదే అలుగునూర్‌ గడ్డ మీద తొలి ఉద్యమ నినాదాన్ని ఎత్తిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. సభలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, ఎల్‌ రమణ, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, మాజీ ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, బాల్కసుమన్‌, వొడితల సతీష్‌కుమార్‌, సుంకె రవిశంకర్‌, దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధుకర్‌, కోరుకంటి చందర్‌, నాయకులు చల్మెడ లక్ష్మీనర్సింహారావు, నారదాసు లక్ష్మణ్‌రావు, కొండూరి రవీందర్‌రావు, తుల ఉమ, వసంత, జీవీ రామకృష్ణారావు, చల్లా హరిశంకర్‌, రవీందర్‌సింగ్‌, అరుణ, తోట ఆగయ్య, పొన్నం అనిల్‌కుమార్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఫ దీక్షా దివస్‌ స్పూర్తిసభ సైడ్‌లైట్స్‌

- అలుగునూరులో సాయంత్రం 4 గంటలకు ఏర్పాటు చేసిన దీక్షాదివస్‌ సభకు మధ్యాహ్నం 1 గంట నుంచే ఉమ్మడి జిల్లా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

- 2.30 గంటల నుంచి 5 గంటల వరకు కళాకారులు మధుప్రియ, మానుకోట ప్రసాద్‌, సందీప్‌, వరం, మాట్ల తిరుపతి తన ఆట, పాటలతో ఉర్రూతలూగించారు.

- ప్రధాన వేదిక నుంచి రసమయి బాలకిషన్‌ దేఖ్‌ లేంగే.. దేఖ్‌లేంగే అంటూ పాడుతూ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో జోష్‌ నింపారు...

- డ్రోన్లకు బ్యానర్లను కట్టి ప్రదర్శించడంతో వాటిని ఆసక్తిగా తిలకించారు.

- వాహనాలను నిలిపేందుకు రెండు చోట్ల పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు.

- కేటీఆర్‌ వెళ్లే వరకు జామర్లను ఏర్పాటు చేయడంతో సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ నిలిచిపోయింది

- కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టిన ఫొటోలతో రెండు, మూడు చోట్ల సెల్ఫీపాయింట్లను ఏర్పాటు చేయగా ఉత్సాహంగా సెల్పీలు తీసుకున్నారు.

Updated Date - Nov 30 , 2026 | 01:11 AM