Fish Skin Used to Heal Pet Dog Injury: పెంపుడు కుక్క గాయానికి చేపచర్మం!
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:26 AM
పెంపుడు కుక్కకు అయిన చిన్న గాయం పెద్దగా మారింది. దాంతో కనీసం నడవడం, నిద్ర పోలేని స్థితిలో ఉండగా.. గాయానికి చేపచర్మం అమర్చి ఆ కుక్కకు కొత్త జీవితం ప్రసాదించారు.
అమర్చిన పెట్స్‌కేర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
పశువైద్యంలో నూతన ఆవిష్కరణకు నాంది
బర్కత్‌పుర, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : పెంపుడు కుక్కకు అయిన చిన్న గాయం పెద్దగా మారింది. దాంతో కనీసం నడవడం, నిద్ర పోలేని స్థితిలో ఉండగా.. గాయానికి చేపచర్మం అమర్చి ఆ కుక్కకు కొత్త జీవితం ప్రసాదించారు. నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఉన్న పెట్స్‌కేర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్య నిపుణులు చేసిన ఈ చికిత్స అనంతరం ఆ కుక్క పూర్తిగా కోలుకుని హుషారుగా తిరుగుతోంది. ఈ వైద్యం నూతన ఆవిష్కరణకు నాంది పలికింది. దానికి సంబంధించిన వివరాలను శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పెట్స్‌కేర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వ్యవస్థాపకులు చీఫ్ వెటర్నరీ డాక్టర్ వెంకట్‌యాదవ్, వెటర్నరీ ప్రొఫెసర్ లక్ష్మణ్, డాక్టర్ షరీన్ వివరించారు. 2025 అక్టోబరు 2వ వారంలో ఈసీఐఎల్‌కు చెందిన రాఘవ పెంపుడు కుక్క(గోల్డీ)కి అయిన చిన్న గాయం విస్తరించి 50 శాతం శరీరానికి పాకింది. దీంతో కనీసం నడవడం, కూర్చోవడం, పడుకోలేని పరిస్థితితో తీవ్రంగా ఇబ్బంది పడింది. తిండి కూడా సరిగ్గా తినలేదు. పెంపుడు కుక్క పడుతున్న ఈ బాధలను చూసి యజమాని రాఘవ పెట్స్‌కేర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సంప్రదించారని వారు తెలిపారు. కుక్కను పరీక్షించిన అనంతరం తిలాపియా చేప శరీరాన్ని గాయంపై అతికించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి చేప శరీరాన్ని కుక్క గాయంపై అతికించడం జరిగిందన్నారు. అనంతరం మూడు నెలల్లో కుక్క పూర్తిగా కోలుకుని గాయం మానిపోయి ఆరోగ్యంగా ఉందన్నారు. పెంపుడు కుక్క యజమాని రాఘవ మాట్లాడుతూ.. ఈ వైద్యానికి లక్ష రూపాయల వరకు ఖర్చయిందన్నారు.