Share News

జానపద జాతర..

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:42 AM

జనపదం.. జానపదంగా.. జన జాతరగా సాగింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన జానపద గాయకులు, కళాకారుల పల్లె పాటలు అందరి హృదయాలను తాకింది. సిరిసిల్ల మానేరు తీరంలో తెలంగాణ పల్లె పాటలు, బతుకమ్మ ఆటలు, కోలాటాలు, డప్పు దరువు, డోలు మోతలతో దద్దరిల్లిపోయింది. మంగళవారం రాష్ట్రస్థాయిలో ఏర్పడిన తెలంగాణ ఇండస్ట్రీ సంస్థ ఆవిర్భావ వేడుకలు

జానపద జాతర..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

జనపదం.. జానపదంగా.. జన జాతరగా సాగింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన జానపద గాయకులు, కళాకారుల పల్లె పాటలు అందరి హృదయాలను తాకింది. సిరిసిల్ల మానేరు తీరంలో తెలంగాణ పల్లె పాటలు, బతుకమ్మ ఆటలు, కోలాటాలు, డప్పు దరువు, డోలు మోతలతో దద్దరిల్లిపోయింది. మంగళవారం రాష్ట్రస్థాయిలో ఏర్పడిన తెలంగాణ ఇండస్ట్రీ సంస్థ ఆవిర్భావ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబరాన్ని అంటే విధంగా సాగాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి జానపద గాయకులు, రచయితలు, టెక్నీషియన్లు పెద్ద సంఖ్యలో తరలిరాగా, టీజీఎఫ్‌ఐ వేడుకలు తిలకించడానికి సిరిసిల్ల కళాశాల మైదానానికి వేలాదిగా కళాభిమానులు తరలివచ్చారు. పల్లె పదాల పాట ఆటతో తెలంగాణ సంస్కృతిని చాటుతూ మనసులో పొంగిపొరలే భావాలతో పాడిన పాటలకు కళాభిమానులు కూడా జేజేలు పలికారు. తెలంగాణ ఫోక్‌ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎస్పీ మహేష్‌ బీ గితే, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్‌పర్సన్‌ విమలక్క, గాయకుడు నల్లగొండ నర్సిరెడ్డి, సిరిసిల్ల కాంగ్రెస్‌ ఇన్‌చార్జ కేకే మహేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు దేవరాజుతో పాటు పేరొందిన ఫోక్‌ సింగర్లు పాల్గొన్నారు. సినీ, జానపద గాయకుడు నల్లగొండ గద్దర్‌ కొమరం భీం పాటతో ఉర్రూతలూగించారు. సిరిసిల్ల మానేరు మట్టి వాసన, చేనేత చీరలు.. అగ్గిపెట్టలో దాచిపెట్టే అంటూ పాడిన పాట ఆకట్టుకుంది. గాయకులు వరంగల్‌ శ్రీనివాస్‌, దరువు ఎల్లం, కాసర్ల శ్యామ్‌, జడల రమేష్‌, నక్క శ్రీకాంత్‌, ఆకునూరు దేవయ్య గిద్దె రాంనర్సయ్య, మౌనిక యాదవ్‌, తేలు విజయ, రమాదేవి, మురళి మధు, గుండేటి రమేష్‌, శ్రీధర్‌రెడ్డి, అభినయ శ్రీనివాస్‌, గంగ.. ఇలా అనేక మంది కళాకారుల ఆటపాటలు అలరించాయి. ప్రార్ధిని కళాంజలి బోనంతో చేసిన నృత్యం ప్రత్యేకత ఆకర్షణగా నిలిచింది. కళాంజలికి నల్లగొండ నర్సిరెడ్డి రూ.10వేల నగదు అందజేశారు. గాయకుడు కాసర్ల శ్యామ్‌ రూ.50 వేల నగదును ఇటీవల మృతిచెందిన కళాకారుడు సతీష్‌ కుటుంబానికి అందజేశారు. నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు సినిమా రంగానికి ఇస్తున్న విధంగా ఫోక్‌ ఇండస్ట్రీకి కూడా రాయితీలు ప్రభుత్వం ఇవ్వాలని, కళాకారులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌, ప్రమాద బీమా, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫోక్‌ ఇండస్ట్రీ అధ్యక్షుడు పత్తిపాటి రమణాకర్‌, ప్రధాన కార్యదర్శి మొహమ్మద్‌ సత్తార్‌, ఉపాధ్యక్షుడు జీఎల్‌ నాందేవ్‌, కళాంజలి రాజేష్‌, ప్రచార కార్యదర్శి ఆకునూరి దేవయ్య, కోశాధికారి గజ్జల వేణు, సలహాదారులు దరువు అంజన్న, మల్లికార్జున్‌, పాత శ్రీధర్‌, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా సాగిన కళాకారుల ప్రదర్శన

తెలంగాణ ఫోక్‌ ఇండస్ట్రీ ఆవిర్భావాన్ని చాటుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత చౌక్‌ నుంచి విభిన్న వేషాలతో కళాకారుల ప్రదర్శన అంబరాన్ని అంటింది. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్‌పర్సన్‌ విమలక్కతోపాటు మహిళా కళాకారులు బతుకమ్మలతో తరలివస్తే, మహిళలు కోలాటం, నిత్యబోనాలతో ఆటపాటలతో కదిలారు. ఒగ్గుడోలు, డప్పు మోత, జానపదుల వేషధారణలతో సిరిసిల్ల కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన వేదిక వరకు సాగింది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు ర్యాలీలో నడుస్తుంటే ప్రజలు వారిని స్వాగతించారు. సెల్ఫీలు దిగుతూ సందడిగా చేశారు.

Updated Date - Nov 04 , 2026 | 01:42 AM