Share News

political: నార్మూల్‌లో రాజకీయ రగడకు తెర

ABN , Publish Date - Jan 09 , 2026 | 12:42 AM

నల్లగొండ-రంగారెడ్డి పాలఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార యూనియన్‌ లిమిటెడ్‌ (నార్మూల్‌)లో రాజకీయం తారాస్థాయికి చేరింది. చైర్మన్‌ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.

political: నార్మూల్‌లో రాజకీయ రగడకు తెర

మదర్‌ డెయిరీ చైర్మన్‌ రాజీనామా

అత్యవసర సమావేశంలో నిర్ణయం

చైర్మన్‌ను తప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు

రూ.12కోట్లు పాల బిల్లులు చెల్లించేందుకు ముందుకొచ్చిన ఓ డైరెక్టర్‌?

రైతులకు న్యాయం జరుగుతుందంటే రాజీనామాకు సిద్ధం: చైర్మన్‌మధుసూదన్‌రెడ్డి

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి) : నల్లగొండ-రంగారెడ్డి పాలఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార యూనియన్‌ లిమిటెడ్‌ (నార్మూల్‌)లో రాజకీయం తారాస్థాయికి చేరింది. చైర్మన్‌ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కొన్నాళ్లకు కొనసాగుతున్న రాజకీయ క్రీడకు ఈ రాజీనామాతో తెరపడినట్లయింది. అయితే తనకు చైర్మన్‌ పదవి ఇస్తే రూ.12కోట్ల పాల బిల్లులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ డైరెక్టర్‌ పేర్కొనడం విశేషం.

హయత్‌నగర్‌లోని నార్మూల్‌ కార్యాలయంలో గురువారం పాలకవర్గం అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చైర్మన్‌తో పాటు పాలకవర్గ సభ్యులు హాజరయ్యారు. రైతులకు చెల్లించే పాల బిల్లులపై ప్రధానంగా చర్చ జరిగింది. మదర్‌ డెయిరీని లాభాల బాట పట్టిస్తామని చెప్పి, కనీసం రైతులకు బిల్లులు కూడా సరైన సమయంలో ఇవ్వడంలేదని, తద్వారా వారి దయనీయంగా మారిందని వాడీవేడి చర్చ జరిగినట్లు సమాచారం. రైతులకు చెల్లించే కొంత మేరకు (రూ.12కోట్లు) బిల్లులు తాము భరిస్తామని, తనకు చైర్మన్‌ పదవిని అప్పగించాలని ఓ డైరెక్టర్‌ కోరినట్లు సమాచారం. అయితే రూ.3కోట్ల మేరకు నార్మూల్‌ సంస్థ పేరు మీద డీడీ కూడా తీసుకొచ్చినట్లు తెలిసింది. మిగతా వాటిని కూడా త్వరలోనే చెల్లిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. కొన్నిరోజులుగా నార్మూల్‌ చైర్మన్‌ను తప్పించి, కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలని ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ ప్రజాప్రతినిధి తెర వెనుక ఉండి..., చైర్మన్‌ను తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చైర్మన్‌తోపాటు డైరెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నార్మూల్‌ పాలకవర్గంపై కొన్నిరోజులుగా కొనసాగుతోన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది.

రైతులకు న్యాయం జరుగుతుందంటే రాజీనామాకు సిద్ధం

రైతులకు న్యాయం జరుగుతుందంటే తాను పదవీ త్యాగానికి సిద్ధమని చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి వెల్లడించారు. రైతులకు తక్షణం రూ.12కోట్ల మేరకు డబ్బులు చెల్లిస్తానని ఓ డైరెక్టర్‌ ముందుకొచ్చారని, ఈ నెల 25 లోగా డబ్బులు ఇస్తానన్నారని వెల్లడించారు. రైతుల బిల్లులు చెల్లింపునకు ఆయన ముందుకు వస్తున్నందుకు తాను పదవీత్యాగానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కాగా రూ.12కోట్లు ఏ విధంగా చెల్లిస్తారని మందడి ప్రభాకర్‌రెడ్డిని ‘ఆంధ్రజ్యోతి‘ సంప్రదించగా..., పాల డీలర్ల ద్వారా చెల్లించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

నార్మూల్‌ చైర్మన్‌గా మందడి ప్రభాకర్‌రెడ్డి

నార్మూల్‌ చైర్మన్‌గా యాదాద్రి భువన గిరి రామన్నపేట మండలానికి చెందిన మందడి ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. గత చైర్మన్‌ మధుసూదన్‌ రెడ్డి గురువారం రాజీనామా చేయడంతో, ఆయన స్థానంలో వెంటనే చైర్మన్‌ నియామకం చేపట్టాలని మెజారిటీ డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో మెజార్టీ డైరెక్టర్లు ప్రభాకర్‌రెడ్డికి మద్దతు తెలియజేయడంతో చైర్మన్‌గా గురువారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు.

రైతుల ఆందోళన ఓవైపు..

నార్మూల్‌ ప్రధాన కార్యాలయంలో రైతులకు చెల్లించాల్సిన పాల బిల్లులతోపాటు ఇతర పాలనాపరంగా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా నార్మూల్‌లో భవిష్యత్‌లో తీసుకోనున్న నిర్ణయాలతోపాటు రైతులకు తక్షణం చెల్లించే బిల్లులు ఎలా చేస్తారన్న అంశంపై సీరియ్‌సగా చర్చ జరిగింది. కార్యాలయంలో పాలకవర్గ సమావేశం జరుగుతుండగా, కార్యాలయం ప్రధాన గేటు ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. పాలకవర్గానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలుచేశారు. రైతులకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌చేశారు. పాలకవర్గ సమావేశం ముగిసిన అనంతరం చైర్మన్‌తోపాటు డైరెక్టర్లను రైతులు అడ్డగించి, పెండింగ్‌ బిల్లుల చెల్లింపుపై స్పష్టం చేయాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా చైర్మన్‌తోపాటు డైరెక్టర్లు మాట్లాడుతూ గతంలో జరిగిన పలు అంశాలపై మాట్లాడుతుండగా, రైతులకు చెల్లించాల్సిన బిల్లులపై మాత్రమే మాట్లాడాలని కోరారు. ఇందుకు త్వరలోనే ఈ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈమేరకు ప్ర భుత్వంతో చర్చలు జరుపుతామని డైరెక్టర్లు చెప్పారు. అయితే ఓ డైరెక్టర్‌ తనకు చైర్మన్‌ పదవి ఇస్తే రూ.12కోట్ల మేరకు ఇస్తామని హామీ ఇచ్చారని, ఈ నెల 25లోగా చెల్లించేందుకు ముందుకు వచ్చార ని చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి రైతులకు వివరించారు. ఏ డైరెక్టర్‌ ముందుకు వచ్చా రు? రూ.12కోట్లు చెల్లిస్తే, మిగతా బిల్లుల పరిస్థితి ఏమిటని రైతులు పాలకవర్గంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సమస్య ను వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తామంటూ వెనుదిరిగారు.

ఎనిమిది బిల్లులు పెండింగ్‌లో..

పాల బిల్లుల చెల్లింపుకోసం కొన్నాళ్లుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పాలశీతలీకరణ కేంద్రాలతోపాటు నార్మూల్‌ ప్రధాన కార్యాలయం ఎదుట భైఠాయించి ఆందోళనకు దిగారు. పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌చేశారు... ప్రస్తుతం రైతులకు ఎనిమిది బిల్లుల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు సమచారం. నాలుగైదు నెలలుగా పాల బిల్లులను సకాలంలో చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులు దాదాపు రూ.35కోట్లకు పైగా ఉంటుందని రైతులు పేర్కొన్నారు. రైతులకు చెల్లించాల్సిన బిల్లులకోసం నెలల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. రోజురోజుకు తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుందని రైతులు విమర్శిస్తున్నారు. సకాలంలో బిల్లులు చెల్లించలేదని పాలకవర్గంపై భగ్గుమంటున్నారు. పాలకవర్గం రైతుల బిల్లుల చెల్లింపు విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.

Updated Date - Jan 09 , 2026 | 12:42 AM