kumaram bheem asifabad- తప్పుల తడక
ABN , Publish Date - Jan 11 , 2026 | 10:12 PM
కాగజ్ నగర్ మున్సిపాలిటీలో వెల్లడించిన ముసాయిదా ఓటర్ జాబితా తప్పుల తడకగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల కోసం ఓటరు ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు. ఇందులో ప్రతీ వార్డులో కూడా 60 నుంచి 100కుపైగా ఓటర్ల సంఖ్య పెరుగడం విశేషం. కాని ఈ ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లు రావడం, డబుల్ ఓటర్లగా నమోదు కావటంతో అంతా హైరాన పడుతున్నారు.
- ప్రతీ వార్డులో 100కుపైగా అదనపు ఓట్లు
- వినతిపత్రాలను అందజేసిన ఆయా పార్టీల నాయకులు కాగజ్‌నగర్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): కాగజ్ నగర్ మున్సిపాలిటీలో వెల్లడించిన ముసాయిదా ఓటర్ జాబితా తప్పుల తడకగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల కోసం ఓటరు ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు. ఇందులో ప్రతీ వార్డులో కూడా 60 నుంచి 100కుపైగా ఓటర్ల సంఖ్య పెరుగడం విశేషం. కాని ఈ ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లు రావడం, డబుల్ ఓటర్లగా నమోదు కావటంతో అంతా హైరాన పడుతున్నారు. అలాగే మున్సిపాల్టీ పరిధిలో ఆనుకొని ఉన్న సమీప గ్రామ పంచాయతీల వారి పేర్లు కూడా ఓటరు జాబితాలో వచ్చాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేసిన కొంత మందికి మున్సిపల్ ఎన్నికల ఓటరు జాబితాలో పేర్లు రావడంతో తప్పుల తడకగా ఉందని పలువురు నాయకులు విమర్శలు చేస్తున్నారు.
- 20 ఏళ్ల క్రితం..
మున్సిపల్ ఎన్నికల కోసం అధికారులు ఓటరు జాబితా రూపొందించగా, 20 ఏళ్ల క్రితం చనిపోయిన వారి పేర్లు ఈ జాబితాలో ఉండడం విశేషం. ఇండస్ట్రీరియల్ ఏరియాలో గతంలో 1-16-223లో నివాసం ఉండే మురళి, గుణ చనిపోగా, వీరి పేర్లు ఈ సారి జాబితాలో వచ్చింది. అలాగే ఓల్డు కాలనీలో కూడా చని పోయిన వారి ఇంటి నెంబరు 1-86-472వహీద్ కూడా చని పోయారు. అలాగే 1-86-473 బేగం, 1-86-473 బేగం చని పోగా వీరి పేర్లు కూడా ఓటరు జాబితాలోకి వచ్చింది. వీటితో పాటు ఓటరు జాబితలో ఒక వార్డులో నివాసం ఉంటున్న వారిని మరో వార్డులోకి మార్చేశారు. సర్‌సిల్క్‌లోని వార్డునెం3కు చెందిన జ్యోతిని వార్డునెం2లో వేశారు. ఇదే వార్డులో నివాసం ఉంటున్న వెంకటిని వార్డులో నెంబరు4లో ఓటు హక్కు వచ్చి. తబస్సుం కూడా 4వ వార్డులో ఓటు హక్కు రావటం విశేషం. తప్పుల తడకగా ఓటరు జాబితాలో ఉన్న బీఆర్‌ఎస్‌కు చెందిన జాకీర్ షరీఫ్, ఎంఐఎం పార్టీకి చెందిన అబ్దుల్ ముబీన్‌తో పాటు పలువురు ఇతర పార్టీల నాయకులు నేరుగా కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాకు ఫిర్యాదు చేశారు. 30 వార్డుల్లో 54061 ఓటర్లు ఉండగా, ప్రతి వార్డులో వందగా ఓటర్ల సంఖ్య పెరిగింది. ఈ నెల 12న తుది ఓటరు జాబితా విడుదల కానుండటంతో పక్కాగా లెక్కలు తీయాలని అంతా డిమాండు చేస్తున్నారు. కాగజ్‌నగర్ మున్సిపాల్టీలో హద్దుల విషయంలో కూడా సవరణ చేయాలని పలువురు నాయకులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగజ్‌నగర్ పట్టణానికి ఆనుకొని ఉన్న కొన్ని గ్రామాల వాసుల ఓట్లను మున్సిపాల్టీ పరిధిలోకి తీసుకొచ్చారు. మున్సిపల్ అధికారులు క్షేత్ర స్థాయిలో ఓటరు జాబితాను సవరణ చేయక పోవటంతోనే ఈ సమస్యలు వచ్చినట్టు పలువురు అధికారుల దృష్టికి తెచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో 250 జీపీలో ఉన్న ఓటర్లు ఉన్నట్టు లెక్కలు తేల్చారు. సర్పంచి ఎన్నికల్లో ఓటేసి, మళ్లీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితాలో కూడా చోటు దక్కటంపై మండి పడుతున్నారు.
అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాం..
-జాకీర్, బీఆర్‌ఎస్ మైనార్టీ సెల్ విభాగం అధ్యక్షుడు
కాగజ్‌నగర్ మున్సిపల్ వార్డుల కోసం ఏర్పాటు చేసి ఓటరు జాబితాలో తప్పుల తడుకగా ఉన్నట్టు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాం. మున్సిపల్‌ని ఆనుకొని ఉన్న బారెవాడ, గాంధీనగర్ తదితర గ్రామాల ఓటర్లు కాగజ్‌నగర్ మున్సిపాల్టీలో చేర్చారు. 250 మందికిపైగా ఉన్నారు. వీరి విషయంలో సబ్ కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు అందజేశాం.
ఓటరు జాబితా సక్రమంగా లేదు..
-మోబీన్, ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు
కాగజ్‌నగర్ మున్సిపాలిటీ ఓటరు జాబితా సక్రమంగా లేదు. వార్డునంబరు 3లోని కొంత మంది ఓటర్లను వార్డు నంబరు 4లో కలిపారు. అ లాగే వార్డు నంబరు2లో కూడా కలిపారు. ఉండేది అంతా కూడా వార్డునెం3లో ఉండగా, వీరిని మార్పు చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు చేశారు. అధికారులు సవరణ చేయాలి. పక్కాగా సరి చేసిన తర్వాతనే తుది జాబితాను విడుదల చేయాలి.
అన్ని పార్టీల నాయకులతో సమావేశం..
-రాజేందర్, మున్సిపల్, కమిషనర్
ఓటరు జాబితాపై అన్ని పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశాం. ఫిర్యాదులను తీసుకున్నాం. అభ్యంతరాలు ఉంటే పరిశీలించి అన్నింటిని తొలగిస్తున్నాం. ఈ నెల 12న తుది జాబితాను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బంది తుది జాబితా కోసం తప్పులను సవరిస్తున్నాం. పూర్తి కాగానే ప్రకటిస్తాం.