kumaram bheem asifabad- చదువుతోనే ఉన్నత భవిష్యత్తు
ABN , Publish Date - Jul 11 , 2026 | 10:47 PM
చదువుతోనే ఉన్నత భవిష్యత్తు సాధ్యమవుతుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వాంకిడి మండలంలోని కోమటిగుడ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని సూచించా
వాంకిడి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): చదువుతోనే ఉన్నత భవిష్యత్తు సాధ్యమవుతుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వాంకిడి మండలంలోని కోమటిగుడ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని సూచించారు. విద్యతో పాటు మంచి సంస్కారం, క్రమ శిక్షణ కూడా విద్యార్థులకు ఎంతో అవసరమని చెప్పారు. యువత మద్యం, మత్తు పదార్థాలు వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి తమ లక్ష్యాల సాధనకోసం కష్టపడి సమాజానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు. జిల్లా సమగ్ర అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వ్యవసాయం, తదితర రంగాల అభివృద్దికి ప్రభుత్వ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గ్రామ పంచాయతీ భవనాల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి రూ. 20 లక్షలతో గ్రామపంచాయతీ భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళా సంఘ సభ్యులు పొదుపును అలవర్చుకుని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. మహిళా సంఘాలు మరింత ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం పలు సంక్షేమ, స్వయం ఉపాధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రజలకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌కార్డులు, సన్నాలకు బోనస్ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు. 2005కు ముందు నుంచి సాగు చేస్తున్న పోడు భూముల విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ హరిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, డీపీవో భిక్షపతిగౌడ్ ఎంపీవో ఖాజా అజీజోద్దీన్, సర్పంచ్ మొతిరాం, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, (ఆంధ్రజ్యోతి): నిరుపేద కుంటుంబాల సొంత ఇంటి కలను నేరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని మానిక్‌గూడ గ్రామంలో శనివారం రూ. 20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అడ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతీ కుటుంబానికి గౌరవ ప్రధమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామపంచాయతీల ద్వారా గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన పరిపాలన సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. గ్రామపంచాయతీలు పల్లె అభివృద్ధికి కేంద్ర బిందువులుగా ఉండాలని చెప్పారు. ప్రజలకు అవసరమైన సేవలు పారదర్శకంగా అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి చిన్నమల్లన్న తదితరులు పాల్గొన్నారు.