Share News

kumaram bheem asifabad- ఉద్యాన పంటలకు ఊతం

ABN , Publish Date - Aug 23 , 2026 | 10:10 PM

ఉద్యాన పంటల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పలు పథకాలను అమలు చేస్తున్నాయి. జిల్లాలో ఇప్పటికే 1,428ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 98ఎకరాల్లో సాగు చేసేలా లక్ష్యం పెట్టుకున్నారు. దీంతో పాటు 1000 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు.

kumaram bheem asifabad- ఉద్యాన పంటలకు ఊతం
లోగో

- జిల్లాలో వెయ్యి ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేయాలని లక్ష్యం

- 1,428 ఎకరాల్లో సాగు చేస్తున్న పండ్ల తోటలు

- 600 ఎకరాల్లో డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటుకు సబ్సిడీ

బెజ్జూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఉద్యాన పంటల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పలు పథకాలను అమలు చేస్తున్నాయి. జిల్లాలో ఇప్పటికే 1,428ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 98ఎకరాల్లో సాగు చేసేలా లక్ష్యం పెట్టుకున్నారు. దీంతో పాటు 1000 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇందులో భాగంగా 384ఎకరాలను గుర్తించి 95ఎకరాల్లో మొక్కలు నాటారు. ఆ మేరకు ఉద్యాన శాఖ అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది పండ్ల తోటలు, ఆయిల్‌పామ్‌, డ్రిప్‌ ఇరిగేషన్‌, శాశ్వత పందిళ్ల నిర్మాణానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాయి.

- సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్‌లో..

కేంద్ర ప్రభుత్వ సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్‌(మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టీకల్చర్‌) పథకం కింద జిల్లాలో కొత్తగా పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. ఫారంపాండ్స్‌, మల్చింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. పండ్ల మొక్కలు నాటిన మూడేళ్ల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. మామిడి, దానిమ్మ, జామ, సపోట, డ్రాగన్‌ప్రూట్‌, నేరేడు, నిమ్మ వంటి తోటల సాగుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సహకాలు ప్రకటించింది. జిల్లాలో ఫారం పాండ్స్‌-2, మల్చింగ్‌ 80ఎకరాల్లో గుర్తించారు. అదే విధంగా ఉద్యాన యాంత్రీకరణ పథకం కింద 40శాతం రాయితీతో మూడు మినీ ట్రాక్టర్లు ఉన్నాయి. ఎస్సీలకు ఒకటి, ఎస్టీలకు ఒటకి, ఇతరులకు ఒకటి అందుబాటులో ఉన్నట్లు ఉద్యాన అధికా రులు చెబుతున్నారు.

- తీగజాతి కూరగాయలు..

తీగజాతి కూరగాయల సాగును ప్రభుత్వాలు ప్రోత్సహించేందుకు ఆర్‌కేవీవై(రాష్ర్టీయ కృషి వికాస్‌ యోజన) పథకం కింద జిల్లాలో 6ఎకరాలో(4-యూనిట్లు)్ల శాశ్వత పందిళ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే నాలుగు యూనిట్లను పూర్తి చేశారు. ఒక యూనిట్‌ వ్యయం రూ.లక్ష కాగా, ప్రభుత్వం 50శాతం సబ్సిడీ ఇస్తోంది. అంటే రైతులు రూ.50వేలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకరు నాలుగు యూనిట్ల వరకు అర్హత పొందొచ్చు. ఈ పథకాల ద్వారా రైతులు నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉందని జిల్లా ఉద్యానవన అధికారులు చెబుతున్నారు.

- రాయితీపై పరికరాలు..

రాయితీపై బిందు సేద్యం పరికరాలను ప్రభుత్వాలు అందజేస్తున్నాయి. ఆయిల్‌పామ్‌ సాగు చేస్తే ఎకరాకు రూ.45,444లబ్ధి పొందనున్నారు. అందుకోసం మొక్కలపై ఎకరాకు రూ.11వేలు, అంతర పంటలు, ఎరువుల కోసం ఎకరాకు రూ.4,200 చొప్పున నాలుగేళ్ల వరకు రూ.17,644ఇస్తారు. బిందుసేద్యం పరికరాల కోసం ఎస్సీ, ఎస్టీలకు 90శాతం, చిన్న సన్న కారు రైతులకు 80శాతం, ఇతర రైతులకు 70శాతం సబ్సిడీ ఇస్తారు. కేటగిరీతో సంబంధం లేకుండా ప్రతీ రైతుకు 2.5శాతం జీఎస్టీ కట్టుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో సూక్ష్మ నీటి సేద్యం కింద 600ఎకరాల్లో సాగు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా జాతీయ వెదురు మిషన్‌ పథకంలో భాగంగా రైతులకు ఇది అదనపు ఆదాయాన్ని సమకూర్చేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. గట్ల వెంబడి పెంచే వెదురు ప్లాంటేషన్‌ కోసం మొదటి ఏడాది ఒక్కో మొక్కకు రూ.90, రెండో సంవత్సరం రూ.60 రెండేళ్ల పాటు ప్రభుత్వం ఇవ్వనుంది. ఒక్కో ఎకరాకు 160 మొక్కలు అవసరం ఉంటుంది. ఇలా ప్రభుత్వం రెండేళ్ల పాటు రూ.48వేలు అందించనుంది.

ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి..

- అబ్దుల్‌ నదీం, జిల్లా ఉద్యానవన అధికారి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పలు పథకాలకు రాయితీలు ప్రకటించిన నేపథ్యంలో ఈ అవ కాశాన్ని రైతులు వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలి. ముఖ్యంగా ఆయిల్‌పామ్‌, పందరి సా గు, పండ్ల తోటలను సాగు చేయాలి. రాయితీల వివరాల కోసం ఉద్యానవన అధికారులను సంప్రదించాలి.

Updated Date - Aug 23 , 2026 | 10:10 PM