Share News

అక్కడ పందెం.. ఇక్కడ చికిత్స

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:28 AM

సంక్రాంతి పండుగ సం దర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిసరాల్లో నిర్వహించిన కోడిపందేల్లో గాయపడిన కోడిపుంజులు కోలుకోలేని స్థితిలో ఉన్నాయి.

అక్కడ పందెం.. ఇక్కడ చికిత్స
కోడికి చికిత్స చేస్తున్న పశువైద్యాధికారి పెంటయ్య

గాయపడిన కోళ్ల చికిత్సకు కోదాడకు క్యూ

సకాలంలో వైద్యం అందితే మాములు స్థితికి

పశువైద్యశాలకు తీసుకొస్తున్న పందెంరాయుళ్లు

కోదాడ రూరల్‌, జనవరి 25(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సం దర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిసరాల్లో నిర్వహించిన కోడిపందేల్లో గాయపడిన కోడిపుంజులు కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. గాయపడిన కోళ్లకు చికిత్సకోసం పందెంరాయుళ్లు సూర్యాపేట జిల్లా కోదాడలోని పశువైద్యశాలకు క్యూ కడుతున్నారు. కోడి కాళ్లకు కత్తులు కట్టడంతో తప్పించుకునేందుకు ఎగిరే క్రమంలో తొడ, పొట్ట కింది భా గం, కండలు తెగి పుంజులు తీవ్రంగా గాయపడ్డాయి. ఎక్కువగా కోడిపందేల్లో కాళ్లు తెగిపోతుంటాయి. పందెంలో గాయపడిన పుంజులకు వైద్యం చేయించకుండా వదిలితే మృత్యువాత పడతాయి. పందేలు ముగిసి పది రోజులవుతున్నా పందెంరాయుళ్లు పుంజులకు వైద్యం చేయించేందుకు పశు వైద్యశాలకు వస్తున్నారని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పెంటయ్య ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

పుంజులకు సకాలంలో వైద్యం అందితే..

గాయపడిన పుంజులకు వెంటనే చికిత్స అందిస్తే ధనుర్వాతం రాకుండా నొప్పులు, వాపులకు ఇంజక్షన్‌ వేయించాలి. కానీ పందాలు జరిగిన వెంటనే వైద్యం అందకపోవడంతో అనేక కోళ్లు మృత్యువాత పడుతుంటాయి. వైద్యం త్వరగా అందిస్తే త్వరగా గాయాలు మాని కోడి ఆరోగ్యంగా ఉంటుంది. దగ్గరలో ఆసుపత్రులు కూడా అందుబాటులో ఉండవు. పందేళ్ల పాల్గొన్న పుంజులకు దెబ్బలతో రక్తస్రావమై, మట్టి చెత్తచెదారం అంటి గాయాల వద్ద వాపులతో కోడికి జ్వరంసోకి నొప్పులతో నీరసం అవుతుంది. త్వరగా వైద్యం అందిస్తే త్వరగా గాయాలు మాని 15రోజుల్లో కోడి మాములు స్థితికి చేరుకుంటుంది. ఆలస్యం అయినా కొద్దీ గాయం సెప్టిక్‌ అయి ఆకుపచ్చగా, నల్లగా మారి కండ భాగాల్ని తొలగించాల్సి ఉంటుంది. దీంతో ఆ కోడి పందేలకు పనికి రాదు. అరుదుగా కత్తులు పొట్టలోపలికి దిగినప్పుడు కోళ్లు అక్కడికక్కడే మృత్యవాత పడ తాయి. రాజుల కాలంలో సైతం బలపరీక్ష పోటీలు పెట్టి ప్రజలకు వినోదాల్ని పంచారు తప్ప పోటీదారుల ప్రాణాలు తీయలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిన ఈ కాలంలో సైతం మూగజీవాల్ని కత్తులతో యుద్ధాలు చేయిస్తూ, డబ్బు ఆర్జించడం పైశాచిక ఆనందమేనని కోళ్లను చూసేందుకు వచ్చిన స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - Jan 26 , 2026 | 12:28 AM