అయ్యో డాక్టరమ్మ..!
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:25 AM
తొమ్మిది నెలల గర్భంతో ఉన్న వైద్యురాలు ఆమె. రేపోమాపో ఓ బిడ్డను ప్రసవించి.. అమ్మ.. అనే అనుభూతిని పొందాలని కలల కంటున్నారు...
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్
9 నెలల గర్భంతో ఉన్న వైద్యురాలి మృతి
ఆమె భర్తకు స్వల్ప గాయాలు
వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
మట్టెవాడ, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): తొమ్మిది నెలల గర్భంతో ఉన్న వైద్యురాలు ఆమె. రేపోమాపో ఓ బిడ్డను ప్రసవించి.. అమ్మ.. అనే అనుభూతిని పొందాలని కలల కంటున్నారు. కానీ విధి మరోలా ఉంది. టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతున్న ఆ నిండు గర్భిణిని కబళించేసింది. వరంగల్‌లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది నెలల గర్భిణి అయిన సాలి మమతా రాణి(33) అనే వైద్యురాలు ప్రాణాలు కోల్పోయారు. మట్టెవాడ సీఐ కరుణాకర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ హంటర్‌రోడ్‌లోని ఫాదర్ ఆఫ్ కొలొంబో వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న మమతారాణి ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. సోమవారం విధులు ముగించుకున్న తర్వాత తన భర్త డాక్టర్ సాలి రాఘవేంద్రతో కలిసి ద్విచక్రవాహనంపై కొత్తవాడలోని తమ ఇంటికి బయలుదేరారు. అయితే, హంటర్ రోడ్ ఏడుమోరీల జంక్షన్ నుంచి పోతననగర్ వైపు వారు వెళుతుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ టిప్పర్ వైద్య దంపతుల ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈక్రమంలో రాఘవేంద్రకు స్వల్ప గాయాలవ్వగా మమతారాణి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. తొమ్మిది నెలల గర్భిణి అయిన మమతా రాణి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్నుమూశారు. టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని అతి వేగంగా నడపడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. నిర్లక్ష్యంగా లారీ నడిపిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రాఘవేందర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. వైద్య దంపతుల స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్. రాఘవేందర్ ప్రస్తుతం కాకతీయ మెడికల్ కళాశాలలో ఆర్థోపెడిక్ పీజీ విద్యార్థి.