చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యం: మంత్రి దామోదర
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:47 AM
చిన్నారుల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రవ్యాప్తంగా 41 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు వైద్య ఆరోగ్య....
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మంత్రి
హైదరాబాద్/ హైదరాబాద్‌సిటీ/యూసుఫ్‌గూడ, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): చిన్నారుల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రవ్యాప్తంగా 41 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆదివారం రాష్ట్రస్థాయి పల్స్ పోలియో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో పట్టణ పీహెచ్‌సీలో ఆయన ప్రారంభించి, చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటింటి సర్వేలో భాగంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటు వైద్య సిబ్బంది పర్యటిస్తారని, పోలియో చుక్కలు వేసుకోలేని చిన్నారులకు చుక్కలు వేస్తారని పేర్కొన్నారు. చిన్నారులకు తప్పక పోలియో చుక్కలు వేయించాలన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. ఐదేళ్ల లోపు వయసున్న 40.97 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఏకంగా 38.95 లక్షల (95.1శాతం) మందికి పంపిణీ పూర్తయింది. పల్స్ పోలియో కవరేజ్‌లో 99శాతం లక్ష్యాన్ని సాధించి రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో భద్రాద్రి కొత్తగూడెం (98.9శాతం), మెదక్ (98.6శాతం), ములుగు, వనపర్తి( 98.2శాతం), జయశంకర్ భూపాలపల్లి( 98.1శాతం) జిల్లాలు నిలిచాయి.