Share News

ఒకేసారి 94 మంది వైద్యుల తొలగింపు

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:27 AM

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగం.. బయట ప్రైవేట్‌ క్లినిక్‌ల దందా..!! ఇదీ రాష్ట్రంలోని కొందరు ప్రభుత్వ వైద్యుల తీరు. పేదలకు వైద్యం అందించాల్సిన బాధ్యతలను గాలికొదిలేసి, ఏళ్ల తరబడి ఆస్పత్రుల ముఖం...

ఒకేసారి 94 మంది వైద్యుల తొలగింపు

  • సర్కారీ ఆస్పత్రుల్లో ఏళ్ల తరబడి విధులకు గైర్హాజరవుతున్న అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్లు

  • షోకాజ్‌ నోటీసులిచ్చినా పట్టించుకోని వైనం

  • కఠిన నిర్ణయం తీసుకున్న డీఎంఈ

  • విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగం.. బయట ప్రైవేట్‌ క్లినిక్‌ల దందా..!! ఇదీ రాష్ట్రంలోని కొందరు ప్రభుత్వ వైద్యుల తీరు. పేదలకు వైద్యం అందించాల్సిన బాధ్యతలను గాలికొదిలేసి, ఏళ్ల తరబడి ఆస్పత్రుల ముఖం చూడని 94 మంది వైద్యులపై ప్రభుత్వం వేటు వేసింది. ఏడాదికి పైగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లను తొలగిస్తూ వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) ఎ.నరేంద్ర కుమార్‌ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. షోకాజ్‌ నోటీసులు ఇచ్చినా సరైన సమాధానం రాకపోవడంతో ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం వారిని శాశ్వతంగా ఇంటికి సాగనంపారు. ఈ జాబితాలోని డాక్టర్ల నిర్లక్ష్యం చూస్తే విస్తుపోవాల్సిందే. ఆసిఫాబాద్‌ మెడికల్‌ కాలేజీకి చెందిన అనస్థీషియా డాక్టర్‌ వి.శివాని అయితే ఏకంగా 2018 జూన్‌ నుంచి విధులకు దూరంగా ఉన్నారు. దాదాపు ఎనిమిదేళ్లుగా పోస్టును బ్లాక్‌ చేసి ఉంచారన్నమాట. నిలోఫర్‌ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్‌ అబ్రార్‌ అహ్మద్‌ సిద్దిఖీ 2020 డిసెంబరు నుంచి విధులకు రావడం లేదు. ఇలా చాలా మంది ఏళ్ల తరబడి విధులకు డుమ్మా కొడుతున్నారు. కొందరు వైద్యులు ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారు. సర్కారీ దవాఖానల్లో విధులకు హాజరవకపోవడంతో కీలక విభాగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రస్తుతం వేటు పడిన వారిలో అత్యధికులు గైనకాలజీ, అనస్థీషియా, జనరల్‌ సర్జరీ, పిడియాట్రిక్స్‌ విభాగాలకు చెందినవారే. వైద్యుల్లో అత్యధికులు హైదరాబాద్‌లోనే పనిచేయడానికి మొగ్గు చూపుతుంటారు. కానీ, ఇక్కడి పెద్దాస్పత్రులైన గాంధీ, ఉస్మానియాతో పాటు నిలోఫర్‌, పేట్లబుర్జు ఆస్పత్రుల్లో పనిచేసే అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు సైతం విధులకు ఏళ్లతరబడి డుమ్మా కొట్టడం గమనార్హం. ఇక జిల్లాల్లోనూ అదే తీరు కనిపించింది. సంగారెడ్డి, హనుమకొండ, రామగుండం, మహబూబాబాద్‌, నిజామాబాద్‌ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న వారు కూడా విధులకు గైర్హాజరయ్యారు. వీరందరినీ సర్వీస్‌ నుంచి తొలగించడంతో ఖాళీలను కొత్తవారితో భర్తీ చేసేందుకు మార్గం సుగమమైంది.

Updated Date - Feb 25 , 2026 | 01:27 AM