Share News

‘నాన్నా.. నన్ను బతికించండి’

ABN , Publish Date - Mar 10 , 2026 | 03:56 AM

నిన్నమొన్నటి వరకు తోటి స్నేహితులతో కలిసి కేరింతలు కొడుతూ, ఆటపాటలతో సందడి చేసిన ఓ 13 ఏళ్ల బాలుడి అడుగులు ఇప్పుడు నిశ్శబ్దమయ్యాయి.

‘నాన్నా.. నన్ను బతికించండి’

  • బోన్‌మ్యారో క్యాన్సర్‌తో ఓ బాలుడి పోరాటం

  • వైద్య కోసం రూ.20లక్షలు అవసరం

  • దాతల సాయం కోసం ఎదురుచూపు

ఎర్రుపాలెం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): నిన్నమొన్నటి వరకు తోటి స్నేహితులతో కలిసి కేరింతలు కొడుతూ, ఆటపాటలతో సందడి చేసిన ఓ 13 ఏళ్ల బాలుడి అడుగులు ఇప్పుడు నిశ్శబ్దమయ్యాయి. విధి ఆడిన వింత నాటకంలో ఆ చిరుప్రాయం మంచానికే పరిమితమైంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రానికి చెందిన సాయి భవేశ్‌ (8వ తరగతి) జీవితం ఒక చిన్న కాలి దెబ్బతో తలకిందులైంది. మాములు దెబ్బ అనుకుని ఆస్పత్రికి వెళ్తే.. పరీక్షల అనంతరం అది ప్రాణాంతకమైన ‘బోన్‌ మ్యారో క్యాన్సర్‌’ అని, అది కూడా నాలుగో దశకు చేరుకుందని తేలడంతో ఆ కుటుంబం గుండె పగిలింది. ఏపీలోని విజయవాడలో ఉన్న ఒక ప్రైవేటు మెడికల్‌ ఏజెన్సీలో రిప్రజెంటేటివ్‌గా చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తండ్రి కృష్ణప్రసాద్‌కు, ఇప్పుడు కొడుకు ప్రాణాలను కాపాడుకోవడం తలకు మించిన భారమైంది. బాబు చికిత్స కోసం రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ పేద తల్లిదండ్రులు దిక్చుతోచని స్థితిలో పడిపోయారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు క్యాన్సర్‌ ట్రస్ట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ బిడ్డను కాపాడుకోవడానికి, ఆ దంపతులు దాతల వైపు దీనంగా చూస్తున్నారు. ‘‘నాన్నా.. నన్ను బతికించండి’’ అంటూ ఆ బాలుడు వేడుకుంటున్న తీరు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. మానవతా దృక్పథంతో స్పందించి, తమ బిడ్డకు పునర్జన్మ ఇవ్వాలని కృష్ణప్రసాద్‌ దంపతులు ప్రాధేయపడుతున్నారు. సాయం చేయాలనుకునే వారు 8142046669, 8897886446 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Updated Date - Mar 10 , 2026 | 03:56 AM