Share News

రెండు హైవేలను 8 లేన్లుగా మార్చాలి

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:47 AM

హైదరాబాద్‌-విజయవాడ (ఎన్‌హెచ్‌-65), హైదరాబాద్‌-బెంగళూరు (ఎన్‌హెచ్‌-44) జాతీయ రహదారులను 6 వరుసలతో కాకుండా.. 8 లేన్లుగా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయనుంది.

రెండు హైవేలను 8 లేన్లుగా మార్చాలి

  • ఎన్‌హెచ్‌-65, 44 విస్తరణ కోసం ఢిల్లీకి మంత్రి కోమటిరెడ్డి

  • కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో త్వరలో భేటీ

హైదరాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌-విజయవాడ (ఎన్‌హెచ్‌-65), హైదరాబాద్‌-బెంగళూరు (ఎన్‌హెచ్‌-44) జాతీయ రహదారులను 6 వరుసలతో కాకుండా.. 8 లేన్లుగా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయనుంది. ఈ అంశంపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీని ప్రత్యేకంగా కలుసుకోనున్నారు. ప్రస్తుత ట్రాఫిక్‌, భవిష్యత్‌లో పెరగబోయే వాహనరద్దీ గురించి వివరించి.. 8 వరుసలుగా విస్తరించాల్సిన ఆవశ్యకతను తెలియజేయనున్నారు. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన నివేదికను అధికారులు సిద్ధం చేశారు. మూడో వారంలో మంత్రి కోమటిరెడ్డి డిల్లీ వెళ్లనున్నారని సమాచారం. కాగా, ఈ రెండు జాతీయ రహదారుల విస్తరణలో తీవ్ర జాప్యం, భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా ‘6 లేన్లు సరిపోతాయా’ పేరుతో బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో ఇదే విషయంపై కేంద్రంతో మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్టు తెలిసింది. ఎల్‌బీ నగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ ప్రాజెక్టుకు సైతం త్వరగా ఆమోదం తెలపాలని మంత్రి కోమటిరెడ్డి కోరనున్నారు. ఈ కారిడార్‌తో ఎల్‌బీ నగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు ట్రాఫిక్‌ రద్దీ తగ్గనుంది.


అలాగే హైదరాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌ వైపు ప్రస్తుత రాజీవ్‌ రహదారికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేకి ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేయనున్నారు. కాగా శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్టును ఇటీవలే జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు బదిలీ చేసిన నేపథ్యంలో.. త్వరితగతిన ప్రాజెక్టు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. మరోవైపు హైదరాబాద్‌-విజయవాడ ప్రస్తుత మార్గం నాలుగు వరుసలతో ఉండగా.. దీన్ని 6 లేన్లుగా విస్తరించాలన్నది ప్రతిపాదన. అయితే ఆరు వరుసలు కాకుండా 8 లేన్లుగా, ‘హై స్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే’ తరహాలో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రాన్ని కోరినట్టు సమాచారం. దీంతో ప్రయాణ సమయం తగ్గుతుందని చెప్పినట్టు తెలిసింది.

Updated Date - Aug 14 , 2026 | 05:49 AM