వివరాలు సరిపోలని ఓటర్లు.. 89.8 లక్షల మంది
ABN , Publish Date - Jun 21 , 2026 | 05:43 AM
రాష్ట్రంలో వివరాల్లో పొంతన సరిగా లేని ఓటర్ల సంఖ్య 89,88,175గా ఉందని.. వారందరికీ ఎన్నికల సిబ్బంది నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి...
మ్యాపింగ్ అయిన ఓటర్లలో ఇది 37.67 శాతం
వారందరినీ ఎన్నికల సిబ్బంది విచారణ చేస్తారు
పొంతన లేని వివరాలతో ఎక్కువ ఓటర్లు ఉన్న జిల్లాలు.. మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, నారాయణపేట్, వనపర్తి
అనర్హుల పేర్ల తొలగింపు కోసమే ‘సర్’ ప్రక్రియ
అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు చేస్తాం
ఈ నెల 25 నుంచి ‘సర్’ ప్రధాన ప్రక్రియ.: సీఈవో సి.సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివరాల్లో పొంతన సరిగా లేని ఓటర్ల సంఖ్య 89,88,175గా ఉందని.. వారందరికీ ఎన్నికల సిబ్బంది నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల సిబ్బంది జూలై 31 నుంచి సెప్టెంబరు 28 మధ్య నిర్దేశించిన తేదీన విచారణకు పిలుస్తారని వెల్లడించారు. సదరు ఓటర్ల వద్ద ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల పత్రాల్లో ఏవీ లేకుంటే.. ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇతర ధ్రువీకరణ పత్రాలను రుజువులుగా పరిగణించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని వివరించారు. శనివారం బీఆర్‌కే భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సి.సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. అనర్హులను తొలగించేందుకే ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను ఎన్నికల సంఘం చేపట్టిందని.. అర్హులైన ప్రతి ఓటరు పేరును జాబితాలో నమోదు చేస్తారని తెలిపారు. ఈ నెల 25 నుంచి ‘సర్’ ప్రధాన ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. వచ్చే నెల 24వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందించి, వివరాలు సేకరిస్తారని తెలిపారు. ఓటర్లు తమ గణన పత్రాలను ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చన్నారు. వచ్చే నెల 24వ తేదీలోపు ఫారాలను పూర్తిచేస్తే.. అదే నెల 31న ప్రచురించే ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు లభిస్తుందని స్పష్టం చేశారు.
మ్యాపింగ్ అయిన ఓటర్లు 70.54 శాతం
జూన్ 20 నాటికి రాష్ట్రంలోని 3.38 కోట్ల ఓటర్లలో 2.38 కోట్ల మంది మ్యాపింగ్ (ప్రాథమిక గుర్తింపు) పూర్తిచేశారు. ఇంకా 99,64,126 మంది ఓటర్ల మ్యాపింగ్ పెండింగ్‌లో ఉందని ఎన్నికల సంఘం వెల్లడించిన నివేదికలో పేర్కొంది. మ్యాపింగ్ పూర్తయిన ఓటర్లలో 89,88,175 మంది (37.67 శాతం మంది) వివరాల్లో వివిధ రకాల ధ్రువీకరణ వ్యత్యాసాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఆధార్ వివరాలు సరిపోలకపోవడం, పేరు, వయస్సు, లింగం, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాల్లో వ్యత్యాసాలు, పొంతన లేకపోవడం, ఒకే వ్యక్తి పేరుతో రెండు చోట్ల ఓటు ఉండటం, మ్యాపింగ్ సమయంలో డేటా సరిపోలకపోవడం వంటి 11 రకాల సమస్యలు ఉన్నట్టు తేల్చారు.
జిల్లాల వారీగా పరిశీలిస్తే.. మహబూబాబాద్ 94.54 శాతం మ్యాపింగ్‌తో తొలి స్థానంలో ఉంది. జనగాం 93.44శాతం, మెదక్ 89.98శాతం, సిద్దిపేట 87.81శాతం, నిజామాబాద్ 87.49, యాదాద్రి 87.39 శాతంతో పురోగతిలో ఉన్నాయి. అత్యల్ప మ్యాపింగ్ అయిన జిల్లాల్లో.. మేడ్చల్ మల్కాజ్‌గిరి (43.67శాతం) ఉంది. హైదరాబాద్ (46.69శాతం), రంగారెడ్డి (58.68శాతం) ఉన్నాయి.
ఓటర్ల సంఖ్య పరంగా హైదరాబాద్ జిల్లాలో.. 47.36 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇప్పటి వరకు 22.11 లక్షల మందికి మ్యాపింగ్ పూర్తయింది. రంగారెడ్డి జిల్లాలో 36.99 లక్షల ఓటర్లకుగాను 21.71 లక్షల మందికి.. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 29.79 లక్షల ఓటర్లకుగాను 13 లక్షల మందికి మ్యాపింగ్ పూర్తి చేశారు.
పొంతనలేని ఓటర్లు ఎక్కువగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 65 శాతం ఉండగా.. తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి (52.70శాతం), నారాయణపేట (44.16శాతం), వనపర్తి (43.40శాతం) ఉన్నాయి.