Share News

నీట్‌లో మెరిసిన తెలంగాణ విద్యార్థులు

ABN , Publish Date - Jul 18 , 2026 | 06:12 AM

నీట్‌ యూజీ 2026 ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు మెరిశారు. నీట్‌లో 99 పర్సంటైల్‌ సాధించిన 138 మంది ఆలిండియా టాపర్స్‌ జాబితాను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది.

నీట్‌లో మెరిసిన తెలంగాణ విద్యార్థులు

  • దేశ వ్యాప్తంగా 99 పర్సంటైల్‌ సాధించిన 138 మందిలో 8 మంది మనోళ్లే

  • హనుమకొండ విద్యార్థికి ఆలిండియా 13వ ర్యాంకు

హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): నీట్‌ యూజీ 2026 ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు మెరిశారు. నీట్‌లో 99 పర్సంటైల్‌ సాధించిన 138 మంది ఆలిండియా టాపర్స్‌ జాబితాను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ 138 మందిలో తెలంగాణ విద్యార్థులు ఎనిమిది మంది ఉండడం విశేషం. ఇందులో హనుమకొండకు చెందిన వీరయ్యగారి సాహ్యు ఆలిండియా స్థాయిలో 13వ ర్యాంకు సాధించారు. సూర్యాపేట జిల్లా నారాయణపురానికి చెందిన బూర సాయి శరణ్‌ 19వ ర్యాంకు సాధించారు. వీరితోపాటు రాష్ట్రానికి చెందిన కందగట్ల హనీ్‌ష(21వ ర్యాంకు), అదేం సాయిచరణ్‌ రెడ్డి(38 వ ర్యాంకు), మయూక్‌ జయసింహా(42), కొంపెల్ల సాయి గాయత్రీతేజో అరుణిమ(83), రుతుంబిక మొహంతీ(91), దేవీష్‌ శ్రీగోపాల్‌ అగర్వాల్‌(123) టాపర్స్‌ జాబితాలో ఉన్నారు. వీరంతా జనరల్‌ కేటగిరిలో 99 పర్సంటైల్‌ సాధించి టాపర్స్‌గా నిలిచారు. ఇక, ఎస్టీ టాప్‌ టెన్‌ కేటగిరిలో కేతావత్‌ ప్రణీత్‌ ఆలిండియా 610 ర్యాంకు సాధించారు. ఇక, రంగారెడ్డి జిల్లా చిలుకూరు సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో 110 మంది నీట్‌ శిక్షణ తీసుకోగా అందులో 60 మంది విద్యార్థులకు వైద్య విద్య కోర్సుల్లో సీట్లు లభించేలా మార్కులు వచ్చాయని ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ శౌరిరాజ్‌ తెలిపారు. హనుమకొండకు చెందిన శ్యాంకరణ్‌ 655 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 1,152వ ర్యాంకు సాధించారు. నల్లగొండలోని ఓ కళాశాలకు చెందిన హ్రూనాస్‌-446, హీబా మైరుక్‌-435, సుమేరా మెహక్‌-434 మార్కులు సాధించారు. అలాగే, మిర్యాలగూడలోని ఓ కళాశాలకు చెందిన రమావత్‌ అనిత 1,356వ ర్యాంకు సాధించారు.


సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధి గాజుల్‌పాడ్‌కు చెందిన బిరాదర్‌ భరత్‌ 568 మార్కులు సాధించగా ఆలిండియా ఓబీసీ కోటాలో 24,408వ ర్యాంకు వచ్చింది. కాగా, దేశ వ్యాప్తంగా 19 మంది విద్యార్థులు 700కు పైగా మార్కులు సాధించారని ఎన్టీఏ వెల్లడించింది. 651-700 మధ్య మార్కులు సాధించిన వారు 1371 మంది, 601-650 మధ్య 8,425 మంది, 551-600 మధ్య 27,055 మంది, 501-550 మధ్య 52,471 మంది సాధించారని ప్రకటించింది. మొత్తంగా 500-720 మధ్య మార్కులు సాఽధించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా 89,341 మంది ఉన్నట్లు తెలిపింది. ఇక 150-200 మధ్య మార్కులు స్కోర్‌ చేసిన వారి సంఖ్య 2,89,565గా ఉంది. 535 మార్కులు సాధించిన విద్యార్థికి ఆలిండియా కేటగిరిలో 50 వేల ర్యాంకు రాగా, 493 స్కోర్‌ చేసిన వారికి లక్ష, 460 మార్కులు స్కోర్‌ చేసిన విద్యార్థికి లక్షన్నర, 433 స్కోర్‌ చేసిన వారికి రెండు లక్షల ర్యాంకు వచ్చినట్లు ఎన్టీఏ పేర్కొంది.

Updated Date - Jul 18 , 2026 | 06:13 AM