Share News

‘డిగ్రీ’లో 75 శాతం హాజరు తప్పనిసరి

ABN , Publish Date - Apr 10 , 2026 | 05:44 AM

ఇక నుంచి డిగ్రీ వార్షిక పరీక్షలు రాయాలన్నా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఇతర ఉపకారవేతనాలు పొందాలన్నా విద్యార్థులకు కనీసం 75శాతం హాజరు తప్పనిసరిగా ఉండాల్సిందే.

‘డిగ్రీ’లో 75 శాతం హాజరు తప్పనిసరి

  • తగ్గితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రద్దు.. విద్యార్థులను పరీక్షలకూ అనుమతించరు

  • ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఎఫ్‌ఆర్‌సీ

  • విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్‌

  • కాలేజీలన్నీ దోస్త్‌లోనే.. ఈసారి స్లైడింగ్‌

  • విద్యాశాఖ ఉన్నతస్థాయి భేటీలో నిర్ణయం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఇక నుంచి డిగ్రీ వార్షిక పరీక్షలు రాయాలన్నా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఇతర ఉపకారవేతనాలు పొందాలన్నా విద్యార్థులకు కనీసం 75శాతం హాజరు తప్పనిసరిగా ఉండాల్సిందే. కనీస హాజరు తగ్గితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఇతర ఉపకార వేతనాలు నిలిపివేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 75 శాతం హాజరు నిబంధన కేవలం ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే ఉంది. ప్రైవేటు కాలేజీల విద్యార్థులు ఏడాదంతా తరగతులకు రాకపోయినా వార్షిక పరీక్షలు అనుమతిస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య తగ్గేందుకు ఇదీ ఓ కారణమని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో అన్ని కాలేజీలకు కనీస హాజరు నిబంధనను తప్పనిసరి చేయాలని, హాజరు తగ్గితే వార్షిక పరీక్షలకూ అనుమతించకూడదని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా నేతృత్వంలో గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిష్టారెడ్డి, ప్రభుత్వ వర్సిటీల వీసీలు పాల్గొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయనున్న అంశాలపై చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని డిగ్రీ కాలేజీలు తప్పనిసరిగా ఎఫ్‌ఆర్‌సీ హాజరును అమలు చేయాలని నిర్దేశించారు. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్‌ నోటిఫికేషన్‌ను ఇంటర్‌ ఫలితాల తర్వాతే విడుదల చేయాలని, కాలేజీలో 15శాతం లోపు ప్రవేశాలుంటే ఇతర కాలేజీల్లో ప్రవేశాలు పొందేందుకు స్లైడింగ్‌ అవకాశం కల్పించాలన్న అంశమూ చర్చకు వచ్చింది. ఇప్పటివరకు కొన్ని కాలేజీలు దోస్త్‌లో చేరకుండా సొంతంగా ప్రవేశాలు చేపడుతుండగా, వాటిని రద్దు చేసి అనిన ప్రైవేట్‌ విద్యా సంస్థలను దోస్త్‌ పరిధిలోకి తేవాలని నిర్ణయించారు. ఆదేశాలను పాటించని కాలేజీలకు షోకాజ్‌ నోటీసు జారీ చేస్తామని పేర్కొన్నారు. ఒక గ్రూపులో ప్రవేశం పొందిన విద్యార్థి మరో గ్రూప్‌ సబ్జెక్టును ఎంచుకునే (బకెట్‌) విధానంపై సమీక్షించి.. మరింత మెరుగైన విధానం రూపొందించాలని, ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాలేజీలో చేరిన తొలి రోజే డిగ్రీ విద్యార్థులందరికీ ఉచితంగా రీడింగ్‌ మెటీరియల్‌ అందించాలన్న నిర్ణయానికి వచ్చారు.

Updated Date - Apr 10 , 2026 | 05:44 AM