Share News

ఉద్యోగుల బిల్లులకు 745 కోట్లు విడుదల

ABN , Publish Date - Feb 28 , 2026 | 04:26 AM

ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ.745 కోట్లను విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లులను క్లియర్‌ చేయడానికి ప్రతి నెలా రూ.700 కోట్ల నిధులను విడుదల....

ఉద్యోగుల బిల్లులకు 745 కోట్లు విడుదల

  • పంచాయతీలకు రూ.389 కోట్లు.. డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో నిధులు విడుదల చేసిన ఆర్థిక శాఖ

  • పంచాయతీల్లో అభివృద్ధి పనుల బిల్లులు క్లియర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ.745 కోట్లను విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లులను క్లియర్‌ చేయడానికి ప్రతి నెలా రూ.700 కోట్ల నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఫిబ్రవరి నెలకుగాను రూ.745 కోట్లను విడుదల చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆర్థిక శాఖను ఆదేశించారు. దీంతో ఆర్థిక శాఖ శుక్రవారం ఈ నిధులను విడుదల చేసింది. జూన్‌ నెలాఖరులో రూ.183 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం... ఆ తర్వాతి నెలనుంచి ప్రతి నెలా వరుసగా కనిష్ఠంగా రూ.700 కోట్లను విడుదల చేస్తూ వస్తోంది. ఇందులో రిటైర్డు ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీతో పాటు జీపీఎఫ్‌ పార్ట్‌ ఫైనల్‌, ఆర్జిత సెలవుల నగదీకరణ, బీమా అడ్వాన్సులకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి. కాగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక శాఖ రూ.389 కోట్లను విడుదల చేసింది. వీటితో పంచాయతీలు చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు క్లియర్‌ కానున్నాయి.

Updated Date - Feb 28 , 2026 | 04:26 AM