Share News

పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ వేగవంతం

ABN , Publish Date - Jul 08 , 2026 | 07:06 AM

పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వేగంగా భర్తీ చేస్తున్నామని, ప్రస్తుతం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైందని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.

పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ వేగవంతం

  • ప్రస్తుతం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది

  • హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వేగంగా భర్తీ చేస్తున్నామని, ప్రస్తుతం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైందని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. పోలీసుశాఖలో మంజూరైన పోస్టులు వేలల్లో ఖాళీగా ఉన్నాయని.. వాటి భర్తీకి వార్షిక జాబ్‌ క్యాలెండర్‌ అనుసరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదిస్తూ.. 30 వేలకుపైగా మంజూరైన పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. పోలీసుశాఖలో ఖాళీలు, భర్తీ ప్రక్రియపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చేవారానికి వాయిదా పడింది.

Updated Date - Jul 08 , 2026 | 07:08 AM